Womens Day Celebrations at Rajbhavan: తనకు ఎలాంటి వ్యక్తిగత లక్ష్యాలు లేవని.. గవర్నర్‌గా పరిధికి లోబడి పనిచేస్తున్నాని తమిళిసై సౌందరరాజన్ అన్నారు. అత్యున్నతమైన రాజ్‌భవన్‌ను కూడా అవమానపరుస్తున్నారని గవర్నర్ పేర్కొన్నారు. రాజ్‌భవన్‌లో జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో పాల్గొన్న ఆమె.. వివిధ రంగాల్లో రాణించిన వారికి అవార్డులు ప్రదానం చేశారు.
తనను అవమానించిన వ్యక్తిని శిక్షించకుండా వారికి బహుమతిని అందించారని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆరోపించారు. ఈ విధమైన చర్యతో రాష్ట్ర ప్రజలకు ఏం సమాధానం చెబుతున్నారని ఆమె ప్రశ్నించారు. సోషల్ మీడియాలో తన గురించి ఇష్టారీతిన వ్యాఖ్యలు చేయొద్దని గవర్నర్ తమిళిసై సూచించారు. తనపై ఎవరు ఎన్ని విమర్శలు చేసినా.. వివక్ష చూపినా వెనక్కి తగ్గనని తేల్చి చెప్పారు. ఎవరెన్ని మాటలన్నా తాను పట్టించుకోనని.. ఓ సోదరిలా ప్రజలకు సేవ చేస్తానని గవర్నర్ స్పష్టం చేశారు. అలాగే వరంగల్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడి మృతి చెందిన మెడికల్ వైద్య విద్యార్థిని ప్రీతి మరణం చాలా కలచివేసిందని తమిళిసై విచారం వ్యక్తం చేశారు.
'నన్ను తీవ్ర పదజాలంతో దూషించిన వారికి రివార్డులు ఇస్తున్నారు. మహిళా లోకానికి ఎలాంటి సందేశం ఇస్తున్నారు. నాకు ఎలాంటి వ్యక్తిగత లక్ష్యాలు లేవు. గవర్నర్‌గా పరిధికి లోబడి పని చేస్తున్నా. సామాజిక మాధ్యమాల్లో ఇష్టారీతిన వ్యాఖ్యలు చేయొద్దు. ఎన్ని విమర్శలు చేసినా.. వివక్ష చూపినా వెనక్కి తగ్గను. రాష్ట్రంలో యువత ఆత్మహత్యలు బాధాకరం. మెడికో ప్రీతి మరణం చాలా కలచివేసింది.'- తమిళిసై సౌందరరాజన్, గవర్నర్
నేను తెలంగాణ బిడ్డనే : రాజ్‌భవన్‌లో అంతర్జాతీయ మహిళా దినోత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో గవర్నర్‌తో పాటు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రాధారాణి, జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు ఖుష్బూ, నటి పూనమ్ కౌర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన నటి పూనమ్ కౌర్.. తాను తెలంగాణలోనే పుట్టి పెరిగానని.. కానీ పంజాబీ అమ్మాయి అని వెలి వేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 'నేను తెలంగాణ బిడ్డను... నన్ను అలా దూరం చేయొద్దు' అని పూనమ్ పేర్కొన్నారు.
పోలీస్ అకాడమీలో ప్రపంచ మహిళా దినోత్సవం : రాష్ట్ర మహిళా భద్రతా విభాగం ఆధ్వర్యంలో తెలంగాణా పోలీస్ అకాడమీలో ప్రపంచ మహిళా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. రాష్ట్రంలో మహిళా భద్రతపై పోలీసు శాఖ చేపట్టిన పలు వినూత్న కార్యక్రమాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని డీజీపీ అంజనీ కూమార్ పేర్కొన్నారు. మహిళా భద్రతపై అమలవుతున్న పలు కార్యక్రమాల ద్వారా రాష్ట్రంలోని మహిళల్లో ఆత్మవిశ్వాసం, ఆత్మస్థైర్యం ఏర్పడిందన్నారు. రాష్ట్ర ఏర్పాటు అనంతరం మహిళా భద్రతకు ముఖ్యమంత్రి కేసీఆర్ అత్యంత ప్రాధాన్యత ఇచ్చారని.. దీనిలో భాగంగానే ప్రత్యేకంగా మహిళా భద్రత విభాగం ఏర్పాటయ్యిందని రాష్ట్ర మహిళా భద్రతా విభాగం అదనపు డీజీ షికా గోయల్ తెలిపారు.
ఇవీ చదవండి: