ధరణి పోర్టల్‌లో టీఎస్ ఎన్‌పీబీ యాప్ ద్వారా వ్యవసాయేతర ఆస్తుల వివరాలు నిక్షిప్తం చేస్తున్నారు. ఇప్పటికే ఆస్తి పన్ను చెల్లిస్తున్న వారి వివరాలు పంచాయతీ, పురపాలక సంస్థల వద్ద ఉన్నాయి. వీటితో నమోదు చేస్తున్న చోట గందరగోళం తక్కువగానే ఉంటోంది. కొత్తగా ఇళ్ల వివరాలు నమోదు చేస్తున్న సమయంలోనేఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఖాళీ జాగాల విషయంలో ఎలాంటి సమాచారం ఇవ్వాలో తెలియడం లేదని కొందరు వాపోతున్నారు. ఇంటి వెనకాల సామగ్రి నిల్వకు వేసుకున్న షెడ్ వివరాలు కూడా అడిగి నమోదు చేస్తున్నారని, రేపు దానికి కూడా ఇంటి పన్ను వేస్తారా అంటూ ఇంకొంతమంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. నమోదుపై సందేహాలను వ్యక్తం చేస్తున్నా సిబ్బంది ‘మేము కేవలం నమోదు చేయడం వరకే పరిమితం’ అని చెబుతున్నట్లు పలువురు పేర్కొంటున్నారు.
సవరణలు ఉంటాయా..
జీహెచ్‌ఎంసీ పరిధిలో ఆస్తుల నమోదుకు సిబ్బంది నమూనా పత్రాలు పంపిణీ చేస్తున్నారు. ఒక పాస్‌పోర్ట్ సైజు ఫొటోతోపాటు పీటీఐఎన్-ప్రాపర్టీ టాక్స్ ఐడెంటిఫికేషన్ నంబరు, ఇతర వివరాలు తెలియజేయాలని సూచిస్తున్నారు. కార్మికులు, నాలుగో తరగతి సిబ్బందితో కొన్ని చోట్ల నమోదు నిర్వహిస్తున్నారు. ధరణి పోర్టల్‌లో సిబ్బంది నిక్షిప్తం చేసే సమయంలో తప్పులు దొర్లితే పరిస్థితి ఏమిటనే ప్రశ్న తలెత్తుతోంది. నమోదుకు ఇళ్ల వద్దకు వస్తున్న సిబ్బంది తమకు ఆధార పత్రాలేవీ అక్కర్లేదని చెబుతున్నప్పటికీ పూర్తి వివరాలు నమోదు చేసుకుంటున్నారు. ఇంటి స్థలం మొత్తం విస్తీర్ణం లాంటి కొన్ని వివరాలు యజమానుల వద్ద ఉంటున్నా, ఖాళీ స్థలం తాలూకు సరైన సమాచారం ఉండటం లేదు. ఇంటి ముందు, వెనుక స్థలం వివరాలను అంచనా మేరకు నమోదు చేస్తున్నారని యజమానులు చెబుతున్నారు. ఏవైనా తేడాలు ఉంటే ధరణి పోర్టల్‌లో సవరణలకు వెసులుబాటు ఇవ్వాలని వారు కోరుతున్నారు.
సమస్యలు ఇవీ
ప్రభుత్వం ఇచ్చిన వెబ్‌సైట్ లింక్‌లో పీటీఐఎన్ నమోదు చేస్తున్న సందర్భంగా యజమానితోపాటు మరికొందరు పేర్లు కొత్తగా కనిపిస్తున్నాయని ఫిర్యాదులు వస్తున్నాయి. ఆధార్‌కార్డులోని పేర్లు, ఆస్తిపన్ను జాబితాలోని సమాచారానికి ఒక్క అక్షరం తేడా ఉన్నా... పూర్తి పేరు మధ్యలో ఖాళీ వచ్చినా వెబ్‌సైట్ తీసుకోవడం లేదు. పూర్తి వివరాలు, యజమాని ఫొటో అప్‌లోడ్ చేయడానికి చాలా సమయం తీసుకుంటోంది. కొన్నిసార్లు వెబ్ ఓపెన్ అవడం లేదు.
ఆధార్ తప్పనిసరే
కొత్త ఆస్తుల నమోదులో యజమాని ఆధార్‌కార్డు తప్పనిసరిగా మారింది. జీహెచ్‌ఎంసీతోపాటు కొన్ని జిల్లా కేంద్రాల్లో ఆధార్‌కార్డులు తీసుకోని వారు ఉన్నారు. రాష్ట్రంలో ఆస్తులు ఉండి విదేశాల్లో స్థిరపడిన వారి విషయంలో ఈ పరిస్థితి ఉంది. ఆధార్ నంబరును ప్రభుత్వం తప్పని సరి చేసింది కాబట్టి దానిని నమోదు చేయకపోతే మిగిలిన వివరాలేవీ తీసుకోదు. నివాస గృహాలను కార్యాలయాలకు అద్దెకిస్తే.. వాణిజ్య పన్ను వసూలు చేస్తారా అని కొంతమంది సందేహిస్తున్నారు. ఆస్తి వినియోగం విషయంలో భవనం ఏ రకానికి చెందినది అనే సమాచారం (నివాసం, అపార్ట్‌మెంట్, వాణిజ్యం) నమోదు చేస్తున్నారు. తగిన సమాచారం సిబ్బందికి ఇవ్వాల్సి ఉంటుంది. నివాసానికి నిర్మించిన భవనాలు.. వాణిజ్యానికి వినియోగిస్తుంటే దాన్ని కూడా నమోదు చేస్తున్నారు.
సామాన్యుడి సంశయాలు... పరిష్కార అవకాశాలు
జీహెచ్‌ఎంసీలో యజమానులకు నమూనా పత్రాలు పంపిణీ చేస్తున్నారు. ఇవి పూరించి ఇస్తే తప్పులు లేకుండా నమోదు చేస్తారన్న నమ్మకం ఏంటని చాలామంది పౌరులు అడుగుతున్నారు. అయితే.. ఇప్పటికే ఆస్తి పన్ను చెల్లిస్తున్న వారు సమర్పించాల్సిన అదనపు వివరాల కోసం ఈ పత్రాలు పంపిణీ చేస్తున్నారు. యజమాని ఫొటోతోపాటు 17 రకాల అంశాలను పత్రంలో పూరించాలి. దీనిపై అభ్యంతరం ఉంటే ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని సిబ్బంది సూచిస్తున్నారు. ఫోన్ నంబరు కూడా తీసుకుంటున్నారు. ఒకటి రెండు రోజుల్లో ఫోన్‌కు ఎస్‌ఎంఎస్ వస్తుందని, దాని ఆధారంగా సరిచూసుకోవచ్చని చెబుతున్నారు. నమోదు చేస్తున్న సమాచారాన్ని వెంటనే సరిచూసుకుంటే మేలని అధికారులు సూచిస్తున్నారు. ధరణి పోర్టల్‌లోకి అప్‌లోడ్ చేసిన సమాచారం సరిగాలేదని తెలిస్తే మార్చుకోవడానికి అవకాశం ఉంది. దీనిపై ఇప్పటి వరకు అధికారుల వైపు నుంచి స్పష్టత లేదని కొందరు కంగారు పడుతున్నారు. అయితే.. యజమాని అందుబాటులో లేకపోతే వేరే వ్యక్తులు చెప్పిన సమాచారం రాసుకుని వెళ్తున్నారు. యజమాని నుంచే సిబ్బంది నేరుగా లేదా ఫోన్‌ద్వారా వివరాలు నమోదు చేస్తారని అధికారులు సూచిస్తున్నారు. దూర ప్రాంతాల్లో ఉండేవారికి సంబంధించిన ఫొటోలను వారి బంధువుల ద్వారా సేకరిస్తున్నారు. లేదంటే యాప్‌లో గడిని ఖాళీగా వదిలేస్తున్నారు.
నమోదులో నిర్లక్ష్యం
చార్మినార్, కార్వాన్, మెహిదీపట్నం, సంతోష్‌నగర్, చాంద్రాయణగుట్ట, జూబ్లీహిల్స్ తదితర సర్కిళ్లలో పూర్తిస్థాయిలో నమోదు జరగడం లేదు. సమాచారం ఇవ్వని వారిని వదిలేసి ఇచ్చే వారి వద్ద తీసుకుని వెళ్లిపోతున్నారు. ఇలాంటి ఇబ్బందులుంటే సమీపంలోని సర్కిల్ కార్యాలయాలను సంప్రదించాలని అధికార వర్గాలు సూచిస్తున్నాయి. ఇదే కాకుండా ఏ రకమైనా సందేహాలున్నా బాధ్యులైన స్థానిక అధికారులను సంప్రదించిన మీదటే ముందుకెళ్లాలని పేర్కొంటున్నాయి. స్పష్టత లేని విషయాల్లో క్షేత్ర సిబ్బంది కూడా ఇదే చెబుతున్నారు.
పన్నుల జాబితాలో లేనివి.. నమోదు చేయడం లేదు
ఆస్తుల నమోదు ప్రక్రియలో ఆస్తి కొనుగోలు ఐచ్ఛికాన్ని పొందుపర్చారు. పీటీఐఎన్ నమోదు చేస్తే యాప్‌లో వివరాలు వస్తాయి. పేరు మారకపోతే కొత్తగా కొనుగోలు చేసిన యజమాని వివరాలు, ఆధార్‌ను తెలియజేస్తూ స్థానిక సంస్థల వద్ద (పంచాయతీ లేదా పుర/నగరపాలక) మ్యుటేషన్‌కు దరఖాస్తు చేసుకోవాలి. ఆ తరువాత యాప్‌లో పూర్తి సమాచారం నమోదు చేస్తారు. కొత్తగా ఇల్లు కట్టుకుంటే.. 2019-2020కి ముందు ఆస్తి పన్ను మదింపు గణాంకాల ప్రకారం ఆస్తి పన్నుల జాబితాలో నమోదు కాని యజమానుల వివరాలను తాజాగా ఆన్‌లైన్ చేయడం లేదు. పంచాయతీ లేదా మున్సిపాలిటీ లేదా నగరపాలక సంస్థలో ఇంటి నంబరుకు దరఖాస్తు చేసుకోవాలని.. అది వచ్చాక నమోదు చేసుకుంటామని సూచిస్తున్నారు. అసంపూర్తిగా ఉన్న వాటి వివరాలు కూడా నమోదు చేయడం లేదు. ఇంటితోపాటు ఖాళీ స్థలం, పెరడు, షెడ్ల వివరాలు కూడా నమోదు చేసుకేంటున్నారు. మొత్తం స్థలంలో గృహ నిర్మాణ స్థలం వివరాలే స్థానిక సంస్థల వద్ద ఉన్నాయి. ఇంటి ముందు, ఇంటి వెనుక స్థలాల వివరాలు; దానిలో ఏమైనా గుడిసెలు, షెడ్లు ఉన్నాయా అనేది ఇప్పుడు నమోదు చేస్తారు. యజమాని ఇచ్చే సమాచారాన్నే తీసుకుంటారు. పట్టా, ప్రభుత్వ భూమి అనే వివరాలు తీసుకుంటున్నారు. ఇప్పటికే ఆస్తి పన్ను చెల్లిస్తున్నప్పటికీ భూమి ఎలా సంక్రమించిందనేది నమోదు చేస్తారు. ప్రభుత్వ భూమిలో ఇల్లు కట్టుకున్న వారికి ఇది వర్తిస్తుంది. అనువంశికం, విక్రయం, దానం, ప్రభుత్వం కేటాయించిన భూమి.. అనే ఐచ్ఛికాలను నమోదు చేస్తారు.
ఇచ్చిన వివరాలే నమోదు..
గ్రామ కంఠమైతే హక్కులు కల్పిస్తారా.. అని కొంతమంది సందేహిస్తున్నారు. ఇల్లు ఉన్న ప్రాంతం ఎలాంటిది, సర్వే నంబరు వివరాలు నమోదు చేస్తున్నారు. ప్రభుత్వ భూమి/ గ్రామ కంఠం/ ఆబాదీ లేదా అసైన్డ్ పట్టానా అనేది భూమి స్వభావం అనే ఐచ్ఛికం కింద నమోదు చేస్తున్నారు. ప్రస్తుతం నమోదు ప్రక్రియ మాత్రమే పూర్తి చేస్తున్నారు. అయితే.. ఖాళీ స్థలం ఉన్నవారికి ప్రభుత్వం ఇల్లు ఇస్తుందా అని చాలామంది ప్రశ్నిస్తున్నారు. ఏ నిర్మాణం లేకుండా ఖాళీగా ఉన్న స్థలాల వివరాలు నమోదు చేయడం లేదు. ప్రభుత్వం అలాంటి నిర్ణయం ఇంకా తీసుకోలేదు. సర్వేయర్లు అందుబాటులో లేక గ్రామీణ ప్రాంతాల్లో నోటి మాటగా జాగాల కొలతలు చెబుతున్నారు. అందులో ఏమైనా మార్పులుంటే చేసుకోవచ్చా అనే విషయం యాప్‌లో నమోదు చేయలేదు. యాప్‌లో ఆస్తి యజమానిపేరు, తండ్రి, భర్త, భార్య, పదేళ్లు పైబడిన కుటుంబ సభ్యుల వివరాలు ఆధార్ నెంబర్‌తో సహా నమోదు చేస్తారు. నమోదు చేయించుకునే సమయంలో సరిచూసుకోవాలి. పట్టాపాసు పుస్తకం ఉన్న భూముల్లో ఇల్లు కట్టుకొని జీవించే వారు చాలామంది ఉన్నారు. వ్యవసాయ భూమిలో ఇల్లు కట్టుకుంటే పాసుపుస్తకం నంబరు నమోదు చేస్తున్నారు. ఆధార్ నంబరు కూడా సేకరిస్తున్నారు. ఒక వేళ ఆధార్ నంబరు లేకుంటే ఆహార భద్రత కార్డు, జన్‌ధన్ ఖాతా నంబరు, ఆసరా పింఛను, ఉపాధి హామీ జాబ్ కార్డు నంబరు తీసుకుంటున్నారు. చాలా ప్రాంతాల్లో ఆధార్ నంబరు లేకుంటే యాప్ అనుమతించడం లేదంటూ కేవలం నోట్ పుస్తకంలో సమాచారం రాసుకుని వెళ్తున్నారని కొందరు చెబుతున్నారు.
రెండు ఐచ్ఛికాలకు అనుమతి
ఆస్తుల నమోదులో ఉపయోగిస్తున్న యాప్‌లో ప్రభుత్వం రెండు రకాల ఐచ్ఛికాలకు అనుమతి ఇచ్చింది. కొనుగోలు చేసిన ఇళ్ల విషయంలో ‘సోల్డ్’, యజమాని మరణించినట్లుయితే ‘డెత్’ అనే ఐచ్చికాలను జారీచేశారు. కొనుగోలు చేయడం ద్వారా వచ్చిన ఆస్తి సమాచారం వద్ద పాత యజమాని వివరాల స్థానంలో విక్రయం అని నమోదు చేస్తున్నారు. ఇంటి నంబర్‌కు మ్యుటేషన్ తీసుకునేందుకు దరఖాస్తు చేసుకోవాలని కొత్త యజమానికి సూచిస్తున్నారు. ఇంటి యజమాని మరణించిన సందర్భంలో కుటుంబ సభ్యుల ధ్రువీకరణ స్వీకరించి వారసుల పేర్లు నమోదు చేస్తున్నారు. దీనికి కూడా స్థానిక సంస్థకు దరఖాస్తు చేసుకోవాలని సూచిస్తున్నారు.
జీహెచ్‌ఎంసీలో దాదాపు 20 లక్షలు...
హైదరాబాద్ మహానగరం(జీహెచ్‌ఎంసీ)తోపాటు పురపాలక శాఖ పరిధిలో ఆస్తుల నమోదు సందర్భంగా పలు రకాల చిక్కులు ఎదురవుతున్నట్లు కొందరు యజమానులు పేర్కొంటున్నారు. జీహెచ్‌ఎంసీలో పన్ను చెల్లించే వారి సంఖ్య 16.05 లక్షలు ఉండగా అన్ని రకాల ఆస్తులు కలిపి దాదాపు 20 లక్షల వరకు ఉన్నాయి. ఆదివారం సాయంత్రానికి అధికారులు మూడున్నర లక్షల ఆస్తులను నమోదు చేశారు.
ఇదీ చదవండీ... కొత్త వ్యవసాయ చట్టాల పిటిషన్లపై సుప్రీంలో నేడు విచారణ