ఓ ప్రభుత్వ ఉద్యోగిని నమ్మి తన ఇంటిని చేతిలో పెడితే... స్థానిక పోలీసులతో కుమ్మక్కై మోసం చేశారని మేడ్చల్ జిల్లాకు చెందిన ఓ బాధితుడు రాష్ట్ర మానవహక్కుల కమిషన్‌ను ఆశ్రయించాడు. సుచిత్రలోని సాయిబాబా నగర్ కాలనీలో 2011లో వంద గజాల స్థలంలో ఇంటిని నిర్మించుకున్నామని బాధితుడు మలుగు సురేష్ కమిషన్‌కు వివరించారు. ఆర్ధికంగా ఇబ్బందులు ఎదురు కావడం వల్ల తన బావ శ్రీకాంత్ స్నేహితుడు ప్రభుత్వ ఉపాధ్యాయుడైన సూర్య వద్దకి వెళ్లినట్లు పేర్కొన్నారు. ఇంటిపై బ్యాంక్ రుణం కోసం 25లక్షల రూపాయలను ప్రభుత్వ ఉద్యోగి పర్సనల్ లోన్ కింద తీసుకున్న అనంతరం... ఇద్దరు సరిసమానంగా నగదును తీసుకున్నట్లు వెల్లడించారు. తాను నెల నెల బ్యాంక్ లోన్ చెల్లించడానికి డబ్బులు ఇస్తున్నప్పటికీ... ఆ ప్రభుత్వ ఉద్యోగి బ్యాంక్ లోన్ చెల్లించలేదన్నారు. దీంతో బ్యాంక్ అధికారులు 2018లో తమ ఇంటి నుంచి తమను కట్టుబట్టలతో వెళ్లగొట్టారని ఆవేదన వ్యక్తం చేశారు.
తన ఆస్తిని కాజేయడమే కాకుండా స్థానిక పేట్ బషీర్‌బాగ్ అడ్మిన్ సబ్ఇన్స్పెక్టర్ మహేష్‌తో కుమ్మక్కైన ప్రభుత్వ ఉద్యోగి సూర్య... తనపై అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపించారని బాధితుడు ఆందోళన వ్యక్తం చేశారు. నమ్మించి మోసం చేసిన ప్రభుత్వ ఉద్యోగి సూర్యతో పాటు... చట్టవ్యతిరేక చర్యలకు పాల్పడిన సబ్ ఇన్స్పెక్టర్పై చర్యలు తీసుకొని తనకు న్యాయం చేయాలని బాధితుడు సురేష్ కమిషన్‌ను వేడుకున్నారు. ఈ సంఘటనపై వారంలోగా సమగ్ర నివేదిక ఇవ్వాలని బాలానగర్ డీసీపీని కమిషన్ ఆదేశించింది.
ఇవీ చూడండి: ట్రాన్స్‌ఫార్మర్‌లో మంటలు... భయంతో పరుగులు తీసిన ప్రజలు