ధరణిలో ఆస్తుల నమోదు, లావాదేవీల వల్ల గిరిజన ప్రాంతాల్లోని భూములపై హక్కులకు ఎలాంటి నష్టం వాటిల్లదని హైకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం నివేదించింది. తెలంగాణ గిరిజన ప్రాంతాల భూబదలాయింపు నియంత్రణ చట్టం కింద.. ధరణిలోనూ గిరిజనుల భూములకు రక్షణ ఉంటుందని వివరించింది. కొత్త రెవెన్యూ చట్టం గిరిజన ప్రాంతాలకూ వర్తిస్తుందని స్పష్టం చేసింది. ధరణి పరిధిలోకి గిరిజన ప్రాంతాల భూములు తీసుకురావడం చట్టవిరుద్ధమంటూ ఆధార్ సొసైటీ అధ్యక్షుడు కె.వీరమల్లు దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై రాష్ట్ర ప్రభుత్వం తరఫున గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి క్రిస్టినా హైకోర్టులో కౌంటరు దాఖలు చేశారు.
ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, ములుగు, వరంగల్, మహబూబాబాద్, కొత్తగూడెం, ఖమ్మం, నాగర్ కర్నూలు జిల్లాల్లోని సుమారు 85 మండలాల్లో 1,180 గిరిజన గ్రామాలు ఉన్నాయని వివరించారు. గిరిజన ప్రాంతాల్లోని స్థిరాస్తులకు సంబంధించి అక్టోబరు 22న స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసినట్లు కౌంటరులో పేర్కొన్నారు. భూబదలాయింపుల చట్టానికి లోబడే గిరిజన ప్రాంతాల్లో పాస్‌బుక్‌లు జారీ చేయనున్నట్లు ఆమె తెలిపారు.
బదలాయింపు నిషేధం వారసత్వానికి వర్తించదని.. గిరిజనేతరులకు భూమి ఉన్నట్లయితే చట్టప్రకారం సేకరించినట్లు నిరూపించుకోవాల్సి ఉంటుందన్నారు. గిరిజనుల పేరుతో కొనుగోలు చేసి గిరిజనేతరులు అనుభవిస్తున్నార్న ఆరోపణలను పరిశీలించేందుకు అవసరమైతే అధికారులు క్షేత్రస్థాయి పరిశీలనకు వెళ్తారని కౌంటరులో ప్రభుత్వం తెలిపింది. పిల్‌పై సోమవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్, జస్టిస్ విజయ్ సేన్ రెడ్డి ధర్మాసనం విచారణ చేపట్టనుంది.
ఇదీ చదవండి: సోమవారం నుంచి పాతపద్ధతిలో వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు