గ్రేటర్ వరంగల్, ఖమ్మం నగరపాలికలు, జడ్చర్ల, అచ్చంపేట, నకిరేకల్, కొత్తూరు పురపాలికల వార్డుల విభజన ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం రీషెడ్యూల్ చేసింది. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో గతంలో జారీ చేసిన షెడ్యూల్ను మరో ఐదు రోజుల పాటు పొడిగించింది. ఈ మేరకు పురపాలకశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
రెండు కార్పొరేషన్లు, నాలుగు మున్సిపాల్టీల్లో 15, 16 తేదీల్లో వార్డుల విభజన నోటీసు జారీ చేస్తారు. 17 నుంచి 23 వరకు ప్రజలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల నుంచి సలహాలు స్వీకరిస్తారు. 24 నుంచి 26 వరకు సలహాలు, వినతులను పరిష్కరించాల్సి ఉంటుంది.
27న కలెక్టర్ ఆమోదం కోసం వార్డుల విభజన ప్రతిపాదనలు పంపాలి. 28న పురపాలక శాఖ సంచాలకులకు నివేదించాలి. 30న వార్డుల విభజన తుది నోటిఫికేషన్ జారీ చేయాల్సి ఉంటుంది. సిద్దిపేట మున్సిపాలిటీకి సంబంధించి మాత్రం యథాతథంగా ఈనెల 25న తుది నోటిఫికేషన్ జారీ చేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.
ఇదీ చదవండి: మహిళలు రాణించడానికి కాంగ్రెస్ విధానాలే కారణం: ఉత్తమ్