తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ పదో తరగతి, ఇంటర్మీడియట్ విద్యార్థులందరినీ పరీక్షలు లేకుండానే పాస్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఓపెన్ స్కూల్ పదో తరగతిలో సుమారు 35 వేల మంది, ఇంటర్మీడియట్లో దాదాపు 43 వేల మంది విద్యార్థులు ఉన్నారు.
కరోనా పరిస్థితుల కారణంగా ఈ ఏడాది ఏప్రిల్, మే నెలల్లో జరగాల్సిన పరీక్షలు వాయిదా పడ్డాయి. ఈ క్రమంలో ఓపెన్ స్కూల్ విద్యా సంవత్సరాన్ని ఎలా ముగించాలో అధ్యాయనం చేసేందుకు 8 మంది అధికారులతో ప్రభుత్వం ఇటీవల కమిటీ ఏర్పాటు చేసింది.
ఓ వైపు పరీక్షలు జరపలేని పరిస్థితులు, మరోవైపు ఇంటర్, డిగ్రీ ప్రవేశాలు త్వరలో ప్రారంభం కానున్న తరుణంలో.. పరీక్షలు లేకుండానే విద్యార్థులందరినీ ఉత్తీర్ణుల్ని చేయాలని ఈ నెల 16న కమిటీ తీర్మానించింది. కమిటీ సిఫార్సులను పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం... విద్యార్థులందరికీ 35 శాతం కనీస మార్కులు ఇవ్వాలని జీవో జారీ చేసింది.
మార్కులపై విద్యార్థులు సంతృప్తి చెందకపోతే.. పరిస్థితులు మెరుగుపడిన తర్వాత నిర్వహించే పరీక్షకు హాజరు కావడానికి అవకాశం కల్పించింది. ఫలితాలను ప్రకటించేందుకు చర్యలు తీసుకోవాలని టాస్ డైరెక్టర్‌ను విద్యా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్ర రామచంద్రన్ ఆదేశించారు.