Telangana Formation Day Celebrations : నూతన తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి జూన్ రెండో తేదీతో తొమ్మిది సంవత్సరాలు పూర్తవుతోంది. పదో వసంతంలోకి అడుగు పెడుతున్న వేళ దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. పదేళ్ల తెలంగాణ ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకొని రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను జూన్ 2 నుంచి పది రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా వివిధ కార్యక్రమాలను ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించేలా ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది. రాష్ట్ర ఆవిర్భావం నుంచి ఇప్పటివరకూ జరిగిన ప్రగతిపై విస్తృతంగా ప్రచార కార్యక్రమాల నిర్వహణకు కార్యాచరణ సిద్ధం చేసింది.
Telangana Decade Celebrations : తెలంగాణ కోసం అసువులు బాసిన అమరవీరుల త్యాగాలు, దశాబ్దాల పోరాట చరితను స్మరించుకునేలా కార్యక్రమాలు రూపొందిస్తున్నారు. తొమ్మిదేళ్ల తెలంగాణ ప్రస్థానాన్ని పదేళ్ల పండుగ సందర్భంగా ఘనంగా చాటేలా కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. రాష్ట్ర ఆవిర్భావం నుంచి సాధించిన విజయాలు, అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు, వినూత్న విధానాలు, ఇతర రాష్ట్రాలు, దేశానికి ఆదర్శంగా మారిన అంశాలను ఉత్సవాల్లో భాగంగా అందరికీ వివరించేలా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించేలా కసరత్తు జరుగుతోంది. కేసీఆర్ సర్కార్ ప్రాధాన్యత పథకాలు, వాటి విజయాలను ఘనంగా చాటాలని భావిస్తున్నారు.
భారీ బహిరంగ సభ నిర్వహణకు సన్నాహాలు: సీఎం ఆదేశాల మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఉన్నతాధికారులు కసరత్తు చేస్తున్నారు. అధికారుల కసరత్తు అనంతరం ఎన్ని రోజుల పాటు వేడుకలు నిర్వహించాలి, ఏయే కార్యక్రమాలు నిర్వహించాలన్న విషయమై ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకోనున్నారు. దశాబ్ది ఉత్సవాల సందర్భంగా వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు, కవి సమ్మేళనాలు, ఇతర సంబురాలు కూడా నిర్వహించాలని భావిస్తున్నారు. ఉత్సవాల్లో భాగంగా రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో భారీ బహిరంగసభ నిర్వహణకు కూడా ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఎన్టీఆర్ స్టేడియం, నిజాం కళాశాల మైదానం, ఎల్బీ స్టేడియంలలో ఏదో ఒకచోట భారీ సభ నిర్వహించే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.
ఈ ఉత్సవాల్లో భాగంగా అమరుల స్మారకం ప్రారంభోత్సవం: రాజధాని నడిబొడ్డున నిర్మించిన తెలంగాణ అమరవీరుల స్మారకం ప్రారంభోత్సవాన్ని కూడా దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నిర్వహించనున్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం అసువులు బాసిన అమరవీరులకు గొప్పగా నివాళి అర్పించేలా సచివాలయం ఎదురుగా అమరుల స్మారకం నిర్మాణం పూర్తయింది. స్మారకాన్ని జూన్ ఒకటో తేదీన ప్రారంభించాలని మొదట నిర్ణయించారు. అయితే దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ప్రారంభోత్సవం ఉండాలన్న ఆలోచనతో ఆ తేదీ కాస్తా అటూ, ఇటుగా మారే అవకాశం కనిపిస్తోంది. జూన్ రెండో తేదీన రాష్ట్ర పదో ఆవిర్భావ వేడుకలను రాష్ట్ర వ్యాప్తంగా పండుగ వాతావరణంలో నిర్వహించేలా చర్యలు తీసుకుంటున్నారు. దానికి కొనసాగింపుగా జూన్ నెలలో మరికొన్ని కార్యక్రమాలు నిర్వహించేలా కసరత్తు జరుగుతోంది.
ఇవీ చదవండి: