ధరణి రికార్డుల్లో తప్పుగా పడిన యజమాని పేరును సరిచేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కొత్త ఆప్షన్ తీసుకొచ్చింది(correct mistakes in the Dharani). ధరణి రికార్డుల్లో కొన్ని చోట్ల యజమాని పేరుకు బదులు ఇల్లు, ఇంటి స్థలం అని నమోదయింది. వాటిని సరిచేయాలన్న వినతులపై ప్రభుత్వం సందించి అవకాశం కల్పించింది. ఇలాంటి వాటికి సంబంధించి దరఖాస్తు చేసుకునేందుకు ధరణి(Dharani)లో ‘"ఇష్యూ ఆఫ్ పీపీబీ ఆర్ నాలా కన్వర్షన్ వేర్ పట్టాదార్ నేమ్ ఈజ్ షోన్ యాజ్ హౌజ్ హౌజ్ సైట్" అనే పేరుతో ఆప్షన్ అందుబాటులోకి తెచ్చారు. ఇందుకోసం ధరణి(Dharani) వెబ్‌సైట్‌లో నేరుగా కాని.. మీసేవ కేంద్రానికి వెళ్లి దరఖాస్తు చేయాల్సి ఉంటుంది(mistakes correct opportunity in dharani).
పట్టాదారు వివరాలు, భూమి వివరాలు, పాత పాస్‌బుక్, రిజిస్ట్రేషన్ పత్రాలు వంటి యాజమాన్యాన్ని నిర్ధారించే పత్రాలు, ఆ భూమి ఫొటో, వీడియోను జతచేయాల్సి ఉంటుంది. రైతులతో పాటు సంస్థలు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ప్రక్రియ పూర్తి కాగానే మొబైల్ నంబర్‌కు సందేశం వస్తుంది. ఆ తర్వాత బయోమెట్రిక్ అథెంటిఫికేషన్ చేయాల్సి ఉంటుంది. సొంతంగా దరఖాస్తు చేసుకునేవారు సమీపంలోని మీసేవ కేంద్రానికి వెళ్లి బయోమెట్రిక్ పూర్తి చేయాల్సి ఉంటుంది.
బయోమెట్రిక్ పూర్తయ్యాక దరఖాస్తు కలెక్టర్ వద్దకు వెళ్తుంది. కలెక్టర్ ఆ దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి ఆమోదిస్తారు లేదా తిరస్కరిస్తారు. ఆమోదం తెలిపితే వెంటనే ఈ-పట్టాదార్ పాస్‌బుక్ మంజూరవుతుంది. గ్రీన్ కలర్ పాస్‌బుక్‌ను పోస్టు ద్వారా నేరుగా ఇంటికి పంపుతారు.
ఇదిగో ఇలా అప్లై చేసుకోవాలి..
* ఫలానా సర్వే నంబరులో మిగతా భూమి నాలా, ఇళ్లు, ఇళ్ల స్థలాల పరిధిలోకి రాదంటూ వాటికి సరైన ఆధారాలతో ధరణి వెబ్‌సైట్లో దరఖాస్తు చేసుకోవాలి.
* పట్టాదారు వివరాలు, భూమి స్థితి, యాజమాన్య హక్కు పత్రాలు, భూమి వీడియో, ఫొటోలను జత చేయాలి.
* వివరాలు నమోదు చేసిన తరువాత దరఖాస్తుదారుకు ఎస్‌ఎంఎస్ వస్తుంది. మీసేవ కేంద్రానికి వెళ్లి అది చూపించి బయోమెట్రిక్ ధ్రువీకరణ ఇవ్వాలి.
* ఈ దరఖాస్తు కలెక్టర్‌కు వెళ్తుంది. అక్కడ పరిశీలించి వివరాలతో సంతృప్తి చెందితే ఆమోదిస్తారు. వెంటనే పట్టాదారు పాసు పుస్తకాన్ని పోస్టు ద్వారా పంపిస్తారు.
మూడు లక్షలకుపైగా పెండింగ్ మ్యుటేషన్లు
రాష్ట్రంలో గతేడాది సెప్టెంబరులో ప్రభుత్వం కొత్త రెవెన్యూ చట్టాన్ని తెచ్చింది. తహసీల్దార్లకు భూ యాజమాన్య హక్కులు, పాసుపుస్తకాల జారీ అధికారాలు తొలగించింది. గతేడాది మార్చి ఆఖరు నుంచి కరోనాతో రెవెన్యూ కార్యకలాపాలు స్తంభించగా మ్యుటేషన్లు కూడా పెద్ద ఎత్తున పెండింగ్‌లో పడ్డాయి. కొన్ని డిజిటల్ సంతకాల వరకు వచ్చి ఆగిపోయాయి. దాదాపు మూడు లక్షలకు పైగా పెండింగ్ మ్యుటేషన్లు ఉన్నట్లు అంచనా. ఈ ఏడాది ఫిబ్రవరిలో పెండింగ్ మ్యుటేషన్ల బాధితులు మీ సేవలో దరఖాస్తు చేసుకోవాలని రెవెన్యూశాఖ సూచించింది. ఏడు నెలల కాలంలో 1,48,445 దరఖాస్తులు అందగా 1,47,875 పరిష్కరించారు. అయితే ధరణి పోర్టల్లో(dharani portal issues) సర్వే నంబర్లు, ఖాతాలు కనిపిస్తున్న భూములకు సంబంధించిన దరఖాస్తులను మాత్రమే పోర్టల్(dharani portal issues) స్వీకరిస్తోంది. ఖాతాల నుంచి భూ విస్తీర్ణం కోత పడిన, డిజిటల్ సంతకం వరకు వచ్చి నిలిచిపోయిన వ్యవహారాలకు సంబంధించి ఎవరిని సంప్రదించాలో అర్థం కావడం లేదని బాధితులు చెబుతున్నారు. ప్రభుత్వం అన్ని రకమైన భూ సమస్యలకు ధరణి పోర్టల్లో దరఖాస్తు చేసుకోవాలంటూ మూడు నెలల క్రితం ఇచ్చిన ఐచ్ఛికంలో తాము నమోదు చేసినా పరిష్కారం కావడం లేదని కొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చూడండి: Dharani portal problems: రిజిస్ట్రేషన్ పూర్తయినా హక్కుల చిక్కు