రాష్ట్రంలో ఒకరికి కరోనా పాజిటివ్ రావడం వల్ల సర్కార్ అప్రమత్తమైంది. బుధవారం సీఎస్‌తో సమావేశమైన మంత్రి ఈటల రాజేందర్ నలుగురు ఐఏఎస్‌లను వైద్య శాఖకు కేటాయించాల్సిందిగా కోరినట్లు తెలిపారు. మరోవైపు గాంధీకి రోజు రోజుకి కరోనా అనుమానితుల సంఖ్య పెరుగుతున్నందున.. కార్పొరేట్ ఆస్పత్రులు, ప్రైవేట్ బోధన ఆస్పత్రుల సేవలను సైతం వినియోగించుకోవాలని నిర్ణయించింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ అనుమతితో నేటి నుంచి రాష్ట్రంలోని పలు కార్పొరేట్ ఆస్పత్రుల్లో కరోనా లక్షణాలు ఉన్న వారికి కూడా వైద్య సేవలను అందించనున్నారు.
కమాండ్ కంట్రోల్ రూమ్
ఇందులో భాగంగా ఆయా ఆస్పత్రుల్లో... ప్రత్యేకంగా 1080 పడకలు అందుబాటులోకి రానున్నాయి. తెలంగాణలో కరోనా వ్యాప్తిని ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు హైదరాబాద్‌లోని కోటి హెల్త్ అండ్ ఫామిలీ వెల్ఫేర్ కార్యాలయంలో కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేస్తున్నట్లు ఈటల స్పష్టం చేశారు. వివిధ శాఖల సమన్వయం కోసం నాలుగు కమిటీలను ఏర్పాటు చేస్తున్నామన్నారు.
విదేశాల నుంచి వచ్చిన వారికి గాంధీలో పరీక్షలు
కరోనా పాజిటివ్ వచ్చిన రోగితో సన్నిహితంగా ఉన్నవారు సహా... విదేశాల నుంచి వచ్చిన వారికి గాంధీలో పరీక్షలు నిర్వహిస్తున్నారు. బుధవారం 36 మందికి పరీక్షలు నిర్వహించగా.. 31 మందికి నెగెటివ్ వచ్చింది. మరో ఐదుగురి ఫలితాలు రావాల్సి ఉంది. మరోవైపు పర్యటక ప్రదేశాలకు వచ్చే విదేశీ పర్యాటకులకు మాస్క్‌లు, శానిటైజర్లు అందించాలని అధికారులను ఆ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ఆదేశించారు. హోటళ్లు, సమాచార కేంద్రాల వద్ద ప్రచారం కల్పించాలన్నారు.
శానిటేషన్ పనులు
కరోనా సోకిన వ్యక్తి సికింద్రాబాద్ మహేంద్ర హిల్స్‌లో ఉన్నందున.. జీహెచ్ఎంసీ అధికారులు చర్యలు చేపట్టారు. దోమలు, వైరస్ విజృంభణను అరికట్టే ప్రయత్నం చేశారు. కోవిడ్-19 ప్రభావంతో హైదరాబాద్ మెట్రో రైల్ అధికారులు అప్రమత్తమయ్యారు. మెట్రో రైళ్లు, స్టేషన్లు వాటి పరిసర ప్రాంతాల్లో ప్రత్యేక సిబ్బందితో శానిటేషన్ పనులు చేపట్టారు. అటు ఆర్టీసీ బస్టాండ్లు, బస్సులు, రైళ్లు, రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో శానిటేషన్ పనులు నిర్వహించారు.
సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం చేస్తే
కరోనా వైరస్ గురించి సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం చేస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని డీజీపీ మహేందర్ రెడ్డి హెచ్చరించారు. సాధారణ జనజీవనానికి భంగం కలిగించేలా వదంతులు వ్యాప్తి చేయవద్దని ట్విట్టర్ ద్వారా తెలిపారు. కోవిడ్-19 నివారణపై ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతోందన్నారు.
విద్యార్థి మాస్కులు ధరించి
కరోనాపై విద్యాశాఖ ముందుస్తు జాగ్రత్తలు చేపట్టింది. ప్రస్తుతం ఇంటర్ పరీక్షలు జరుగుతున్న నేపథ్యంలో పలు చర్యలకు ఉపక్రమించింది. ప్రతి విద్యార్థి మాస్కులు ధరించి పరీక్షలకు హాజరవ్వొచ్చని తెలిపింది. పరీక్షలకు ముందు బల్లలు శుభ్రపర్చడం వంటి చర్యలు తీసుకున్నట్లు విద్యాశాఖ ప్రధాన కార్యదర్శి చిత్ర రామచంద్రన్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పరీక్షలకు విద్యార్థులు సొంత వాటర్ బాటిళ్లు తీసుకెళ్లే సౌకర్యం ఉందన్నారు. దగ్గు, తుమ్ములతో బాధపడే వారికి ప్రత్యేక గదిలో పరీక్షలు నిర్వహించానున్నారు.
ఇవీచూడండి: 'ఐటీ కారిడార్ ఖాళీ చేయించడం లేదు.. పుకార్లను నమ్మొద్దు'