కరోనా వ్యాధిని నివారించే సమర్థమైన, సురక్షితమైన, తక్కువ ధరలో లభించే టీకా కోసం ప్రపంచం మొత్తం హైదరాబాద్ వైపు చూస్తోందని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై అన్నారు. కరోనా టీకా కొవాగ్జిన్ కోసం భారత్ బయోటెక్ శాస్త్రవేత్తలు అహర్నిశలు శ్రమిస్తున్నారని ప్రశంసించారు. ఈ సంవత్సరాంతానికి కొవాగ్జిన్ అందుబాటులోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
హైదరాబాద్ శివారు శామీర్‌పేట వద్ద గల జినోమ్‌వ్యాలీలోని భారత్ బయోటెక్‌ను మంగళవారం గవర్నర్ సందర్శించారు. ప్రాంగణాన్ని, సంస్థ ప్రయోగశాలలను పరిశీలించారు. సంస్థ సీఎండీ కృష్ణ ఎల్ల, జేఎండీ సుచిత్ర ఎల్ల, ఇతర శాస్త్రవేత్తలను కలిసి.. టీకా తయారీ కృషిని తెలుసుకున్నారు. వారందరికీ గవర్నర్ కృతజ్ఞతలు తెలిపారు. ఆమె భర్త సౌందరరాజన్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సందర్శన అనంతరం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వేదికపై తమిళిసై మాట్లాడారు.
‘‘కరోనా టీకా తయారీలో భాగస్వాములైన ప్రతీ శాస్త్రవేత్తకు ధన్యవాదాలు తెలిపేందుకు ఇక్కడికి వచ్చా. తెలంగాణ, భారతదేశమే కాకుండా ప్రపంచం మొత్తం ఈ టీకా కోసం ఎదురుచూస్తోంది. కరోనాతో చాలా మంది యోధులు, ప్రముఖులు, సామాన్య ప్రజలు మరణించడం బాధాకరం. తక్కువ ధరలో లభించే కొవాగ్జిన్ టీకా ప్రపంచవ్యాప్తంగా ప్రజలందరికీ చేరాలి. సామాజిక, ఆర్థిక స్థితి, దేశాలతో సంబంధం లేకుండా అందరికీ ప్రయోజనం చేకూర్చాలి’’ అని గవర్నర్ అన్నారు.
భారత్ బయోటెక్‌కు ప్రశంసలు
భారత్ బయోటెక్ రికార్డుస్థాయిలో ప్రపంచవ్యాప్తంగా 300 కోట్లకుపైగా వివిధ టీకాల డోసులను సరఫరా చేసి, కోట్ల మంది ప్రాణాలు కాపాడిందని ఈ సందర్భంగా గవర్నర్ ప్రశంసించారు. సంస్థ కృషిని, సాధించిన విజయాలను అభినందించారు. కొవాగ్జిన్ పరిశోధన, తయారీకి నాయకత్వం వహిస్తున్న సుచిత్ర ఎల్లకు గవర్నర్ ప్రత్యేకంగా కృతజ్ఞతా బ్యాడ్జిని బహూకరించారు.
ఇవీ చూడండి:కొవాగ్జిన్ కోసం రాత్రింబవళ్లు శ్రమిస్తున్నారు: గవర్నర్