అమెరికా కేంద్రంగా ఆర్థిక కార్యకలాపాలు నిర్వహించే ప్రతిష్ఠాత్మక సంస్థ గోల్డ్‌మ్యాన్ సాచ్స్ (Goldman Sachs) సంస్థ తన కార్యాలయాన్ని హైదరాబాద్ ప్రారంభించింది. రాయదుర్గంలో కేటీఆర్ (KTR) చేతుల మీదుగా కార్యాలయం ప్రారంభమయింది. పది వేల మంది మహిళా పారిశ్రామిక వేత్తలను రూపొందించాలని గోల్డ్‌మ్యాన్ సంస్థ లక్ష్యంగా పెట్టుకున్నట్లు సంస్థ ప్రతినిధులు కేటీఆర్‌కు తెలిపారు. సంస్థ లక్ష్యాన్ని అభినందించిన కేటీఆర్... ఇందుకోసం వీ-హబ్‌తో కలిసి పని చేయాలని సూచించారు.
హైదరాబాద్ వేగంగా అభివృద్ధి...
బ్యాంకింగ్, ఆర్థిక, బీమా రంగాల్లో హైదరాబాద్ వేగంగా వృద్ధి చెందుతోంది. గడిచిన కొన్నేళ్లలో ప్రతిష్టాత్మక కంపెనీలు పెట్టుబడులు పెట్టాయి. ఈ రంగాల్లో లక్షా 80 వేల మంది కేవలం హైదరాబాద్‌లో ఉపాధి పొందుతున్నారు. ఈ రంగాల్లో భాగ్యనగరానికి ఉన్న అనుకూలతలే ఇందుకు ఉదాహరణ. ఐఎస్‌బీ, ఐఐఎం బెంగుళూరు సహాకారంతో దేశవ్యాప్తంగా పది వేల మంది మహిళా పారిశ్రామికవేత్తలను రూపొందించాలన్న గోల్డ్‌మ్యాన్ సాచ్స్ సంస్థ లక్ష్యాన్ని అభినందిస్తున్నాను.
ఇందుకోసం హైదరాబాద్‌లోని వీ-హబ్‌తో కలిసి పనిచేయాలని కోరుతున్నాను. ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్, మెషీన్ లెర్నింగ్, రోబోటిక్స్, బ్లాక్ చైన్ సాంకేతికతల్లో రాష్ట్ర ప్రభుత్వం భారీగా పెట్టుబడులు పెడుతోంది. ఆర్థిక రంగంలో మరిన్ని ఆవిష్కరణల రూపకల్పనకు టీ-హబ్ దోహదపడుతుందని ఆశిస్తున్నా.
-- కేటీఆర్, ఐటీ శాఖ మంత్రి
ఆర్థిక, బీమా రంగాల్లో నవీన ఆవిష్కరణలు విసృతంగా వస్తున్నాయి. ఈరంగాలకు చెందిన స్టార్టప్‌లు ఇప్పటికే హైదరాబాద్‌లో ఉన్నందున మరిన్ని పెట్టుబడులు పెట్టేందుకు హైదరాబాద్‌కు ప్రత్యేక స్థానం ఉంది. గోల్డ్ మ్యాన్ సాక్స్ వంటి ప్రతిష్ఠాత్మక సంస్థలే కాకుండా స్టార్టప్‌లు వస్తే హైదరాబాద్‌కు మరింత బలం చేకూరుతుంది.నవీన ఆవిష్కరణలకు ఊతం ఇచ్చే పారిశ్రామికవేత్తలను తెలంగాణ ప్రభుత్వం ఎల్లప్పుడు ప్రోత్సహిస్తుంది.గోల్డ్ మ్యాన్ సాక్స్ సంస్థకు హైదరాబాద్‌కు స్వాగతం.....మీ వృద్ధిలో మేం భాగస్వామ్యులం అవుతాం.
-- కేటీఆర్, ఐటీ శాఖ మంత్రి
తెలంగాణ ప్రభుత్వం నవీన సాంకేతికలకు ఊతమిచ్చేలా ఇప్పటికే అనేక సంస్కరణలను చేపట్టిందని కేటీఆర్ తెలిపారు. గోల్డ్ మ్యాన్ సాచ్స్ సంస్థ రాబోయే మూడేళ్లలో రెండు వేల 500 మందికి ఉపాధి కల్పించనుంది.
ఇదీ చూడండి: పేరుకు ప్రైవేటు స్కూల్.. ఫీజు మాత్రం ఏడాదికి రూ.500!