Movie ticket price increase in telangana: తెలంగాణలో సినిమా టికెట్ ధరలు పెరిగాయి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం థియేటర్ యాజమాన్యాలకు టికెట్ ధరలు పెంచుకునేందుకు వీలుగా అనుమతిస్తూ ఉత్తర్వులను జారీ చేసింది. కొంత కాలంగా నిర్మాతలు, ప్రదర్శనకారుల నుంచి వస్తున్న విజ్ఞప్తులను పరిశీలించిన ప్రభుత్వం.. టికెట్ ధరలపై ఆరుగురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీ ఇచ్చిన నివేదిక ప్రకారం 2017లో జారీ చేసిన జీవో 75ను సవరిస్తూ ఈ నెల 21న జీవో 120ను జారీ చేసింది. ఈ ఉత్తర్వుల ప్రకారం రాష్ట్రంలోని సింగిల్ స్క్రీన్, మల్టీఫ్లెక్స్ థియేటర్లలో టికెట్ ధరలు పెంచుకోవచ్చని సూచించింది. ఈ మేరకు జీఎస్టీతోపాటు టికెట్ ధరలను కనిష్ఠంగా 50 రూపాయలకు, గరిష్ఠంగా 300 రూపాయలకు పెంచారు. టికెట్లపై ధర, జీఎస్‌టీ, నిర్వహణ ఛార్జీలు, ఆన్‌లైన్ ఛార్జీలను వేరువేరుగా ముద్రించాలని ప్రభుత్వం సూచించింది.
అనుమతి ఇచ్చిన సర్కారు
Movie ticket price increase: తాజాగా ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం ఏసీ థియేటర్లలో టికెట్ ధర కనిష్ఠంగా 50 రూపాయలు, నాన్ ఏసీ థియేటర్లలో 30 రూపాయలు పెంచుకోవచ్చని సూచించింది. అలాగే మల్టీప్లెక్స్‌లలో కనిష్ఠంగా టికెట్ ధర జీఎస్టీతో కలిపి 100 రూపాయలు పెంచుకునేందుకు అనుమతి ఇచ్చింది. ఏసీ థియేటర్లలో గరిష్ఠంగా 150 రూపాయలు, నాన్ ఏసీ థియేటర్లలో 70 రూపాయలు పెంచుకోవచ్చని సూచించింది. సింగిల్ థియేటర్లలో స్పెషల్ సీట్లకు జీఎస్టీ అదనంగా 200, స్పెషల్ ఐమ్యాక్స్ లేదా అతి పెద్ద తెర ఉన్న సింగిల్ థియేటర్లలో 250 రూపాయలు, మల్టీప్లెక్స్‌లలో 300 రూపాయలు గరిష్ఠంగా పెంచుకోవచ్చని ఉత్తర్వుల్లో పేర్కొంది. అలాగే నిర్వహణ ఛార్జీల కింద ఏసీ థియేటర్లలో 5 రూపాయలు, నాన్ ఏసీకి 3 రూపాయలు వసూలు చేసుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం..
అయితే ఇటీవల కోర్టును ఆశ్రయించి మధ్యంతర ఉత్తర్వుల ద్వారా థియేటర్ యాజమాన్యాలు టికెట్ ధరలను పెంచాయి. ప్రస్తుతం సింగిల్ స్క్రీన్ థియేటర్లలో కనిష్ఠంగా 70 రూపాయలు, గరిష్ఠంగా 150 టికెట్లు అమ్ముతుండగా... తాజాగా వెలువడిన ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం ఆ ధరలు మరింత పెరగనున్నాయి. అలాగే మల్టీఫ్లెక్స్‌లో టికెట్ ధర 200 ఉండగా మరో 50 రూపాయలు పెరగనుంది.
ఎనిమిదేళ్లుగా చర్చలు
టికెట్ ధరల అంశంపై గత ఎనిమిదేళ్ల నుంచి చిత్ర పరిశ్రమ ప్రభుత్వాలతో చర్చలు జరుపుతూనే ఉంది. ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం సానుకూలంగా స్పందించి టికెట్ ధరల పెంపునకు అనుమతి ఇవ్వడం పట్ల తెలుగు చలన చిత్ర నిర్మాతలు, ప్రదర్శనకారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్‌లోనూ టికెట్ ధర అంశం త్వరగా కొలిక్కిరావాలని ఆకాంక్షిస్తున్నారు. అప్పుడే సినీ పరిశ్రమలో నిర్మాతలు నిలదొక్కుకోగలరని, థియేటర్ వ్యవస్థ, చిత్ర పరిశ్రమ ఆరోగ్యంగా ఉంటుందని భావిస్తున్నారు.
ఇదీ చదవండి: