ఇటీవల కురిసిన భారీ వర్షాలతో విశాఖ మన్యంలోని గిరిజనులు తల్లడిల్లిపోతున్నారు. వాగులు, గెడ్డలు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నందున మన్యంలోని చాలా గ్రామాలకు బయట ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. మరీ ముఖ్యంగా చింతపల్లి మండలం ప్రజల అవస్థలు వర్ణనాతీతం. ఈ పంచాయతీలో ఉన్న 21 గ్రామాల ప్రజలు అత్యవసర పనులకు, నిత్యావసరాల కోసం ఈ సాహసం చేస్తున్నారు.
వీరు బయటకు వెళ్లాలంటే వాగు దాటాల్సిందే. మామూలు రోజుల్లో అయితే అందులో నడుచుకుంటూ వెళ్లేవారు. వర్షాలతో వాగు ఉద్ధృతమవటం వారికి ప్రాణసంకటమైంది. గ్రామస్థులు అవతలి ఒడ్డుకు తాడుకట్టి దాని సహాయంతో వాగు దాటుతున్నారు. ప్రమాదకరంగా తాడుపై వేలాడుతూ ఆవలి ఒడ్డుకు చేరుకుంటున్నారు.
గత ప్రభుత్వం ఈ వాగుపై వంతెన కోసం 4 కోట్ల రూపాయలు మంజూరు చేసి తొలి విడతగా కోటి రూపాయలు విడుదల చేసింది. అవి వంతెన పునాదులకు సరిపోయాయి. ఆ తర్వాత నిధులు రాక... వంతెన నిర్మాణం సగంలో ఆగిపోయింది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వంతెన నిర్మాణం పూర్తిచేయాలని గిరిజనులు కోరుతున్నారు.
ఇదీ చూడండి : ఆర్టీసీ డ్రైవర్ నిర్లక్ష్యం.. కాలు కోల్పోయిన విద్యార్థిని