Hyderabad Traffic Police Setup New Pelican Signals : ట్రాఫిక్ నిబంధనలపై పోలీసులు ఎన్ని అవగాహన కార్యక్రమాలు చేస్తున్న చలాన్లను విధిస్తున్నా నిబంధనలు అతిక్రమిస్తున్న వారి సంఖ్య తగ్గడం లేదు. ఇటువంటి వారిపై పోలీసులు కూడా అంతే కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఇటీవల తీసుకొచ్చిన కొత్త విధానంలో భాగంగా ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వాహనదారులకు 5,32,664 జరిమానాలు విధించారు. దీంతో పాటు పాదచారుల కోసం నగరంలో మరికొన్ని పెలికాన్ సిగ్నల్స్ ఏర్పాటు చేయనున్నారు
New Pelican Signals in Hyderabad : హైదరాబాద్‌లో నిత్యం వాహనాల సంఖ్య పెరుగుతూనే ఉంటుంది. ఇందుకు అనుగుణంగానే ట్రాఫిక్ పోలీసులు ఎప్పటికప్పుడు నిబంధనలను విధిస్తున్నారు. కొన్నిచోట్ల సిగ్నల్ లేకుండా సాఫీగా వెళ్లేందుకు ఏర్పాట్లు చేశారు. అయితే ట్రాఫిక్ నిబంధనలను అతిక్రమించిన వారిపై కొరడా జులిపిస్తూనే ఉన్నారు. ఈ ఏడాది ఇప్పటివరకు పలు అతిక్రమణలలో ఐదు లక్షలకు పైగా జరిమానాలను విధించారు. వీటిలో ఫ్రీ లెఫ్ట్‌కు అడ్డంగా వాహనాలు నిలిపినందుకు 51,533, స్టాప్‌లైన్ అతిక్రమణకు 2,71,187, అడ్డగోలు పార్కింగ్ 49,038, ఫుట్‌పాత్‌ల ఆక్రమణలపై 33,206, సీపీయాక్ట్ 41(ఎ) కింద 96,359 వాహనాలకూ.. 31,341 వాహనాలకు వీల్‌క్లాంప్ వేసి ఛలానాలు విధించామని వెల్లడించారు.
వీటితో పాటు పాదచారుల భద్రత కోసం నగరంలోని 43 ప్రాంతాల్లో పెలికాన్ సిగ్నల్లు ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదించి.. ఇప్పటికే 31 చోట్ల అందుబాటులోకి తెచ్చామని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. నగరంలో వ్యాపార కార్యకలాపాలు పెరిగిన కారణంగా ఆయా ప్రాంతాల్లో పాదచారుల రాకపోకలు కూడా పెరిగాయి. కొంతమంది చిన్నపాటి వ్యాపారులైతే ఏకంగా వారి దుకాణాలను ఫుట్‌పాత్‌పై నడిపిస్తున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని పాదచారుల భద్రత కోసం సేఫ్ సిటీ ప్రాజెక్టులో భాగంగా రద్దీ ప్రాంతాల్లో పెలికాన్ సిగ్నళ్లు అందుబాటులోకి తెచ్చారు.
pelican Signals in Hyderabad : ఆసుపత్రులు, విద్యాసంస్థలు, వ్యాపార సముదాయాల వద్ద ప్రజల రాకపోకలు ఎక్కువగా ఉండే వ్యూహాత్మక ప్రాంతాల్ని గుర్తించి ఇవి ఏర్పాటు చేశామని ట్రాఫిక్ అదనపు సీపీ సుధీర్ బాబు తెలిపారు. ఈ సిగ్నల్స్ ద్వారా ట్రాఫిక్ వాలంటీర్లు, పోలీసుల సాయంతో 15 నుంచి 20 సెకన్ల పాటు సిగ్నల్‌ను ఆపరేట్ చేసి రోడ్డు దాటొచ్చని.. ఇందుకోసం ప్రతీ పెలికాన్ సిగ్నల్ వద్ద ఇద్దరు ట్రాఫిక్ వాలంటీర్లను, పోలీసులను నియమించామని ఆయన తెలిపారు. వాలంటీర్లు, ఈ సిగ్నళ్లు సక్రమంగా పనిచేస్తున్నాయో స్థానిక ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్లు, ఎస్సైలు పర్యవేక్షిస్తుంటారని వివరించారు.
వీటితో పాటు 71 చోట్ల ట్రాఫిక్ ఐలాండ్స్ అంటే.. నిత్యం రద్దీగా ఉండే 71 కూడళ్లను గుర్తించి అక్కడ పాదచారుల కోసం సూచికలు అందుబాటులోకి తెచ్చామన్నరు. మెట్రోస్టేషన్ల దగ్గర రోడ్డు దాటేందుకు పై వంతెన ఉపయోగించాలని 56 చోట్ల బ్యానర్లు, ఫ్లెక్సీలు ఉంచామని.. అవసరమైన ప్రాంతాల్లో జీబ్రాక్రాసింగ్‌లు, స్టాప్‌లైన్లను మార్కింగ్ చేస్తున్నట్లు పేర్కొన్నారు.
ఇవీ చదవండి:
- Number Plate Tampering : నంబర్ ప్లేట్ ట్యాంపరింగ్‌పై పోలీసుల నజర్.. తప్పుడు ప్లేట్లు వినియోగిస్తే జైలుకే!
- Medchal Traffic DCP Office Demolition : మేడ్చల్ ట్రాఫిక్ డీసీపీ నూతన కార్యాలయం కూల్చివేత.. కారణమిదే..!
- Bandlaguda car accident : బర్త్‌డే మూడ్.. లైసెన్స్ లేకున్నా డ్రైవింగ్.. చివరకు ఆ కుటుంబంలో విషాదం