హైదరాబాద్‌లోని 806 కిలోమీటర్ల నాలాల్లో పూడిక తీత పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ పనుల ద్వారా వచ్చిన పూడికను పరిశీలిస్తే నగర వాసుల బాధ్యతారహిత చర్యలకు అద్దంపడుతోంది. క్వింటాలు వ్యర్థంలో 20శాతం నీటి పరిమాణం, 40శాతం మేర పూడిక మన్ను, తేలియాడే పదార్థాలు 40 శాతం ఉన్నట్లు తేలింది.
మురుగులో ప్లాస్టిక్ వ్యర్థాలదే అగ్రస్థానం
వీటిలో ప్లాస్టిక్ గ్లాసులు, ప్లేట్లు, కవర్లదే సింహభాగం. ఇక ఘనవ్యర్థాలను చూస్తే గాజు పదార్థాలు, భవన నిర్మాణ వ్యర్థాలు, కొబ్బరి బొండాలు దర్శనమిచ్చాయి. ఇంకొన్ని చోట్ల పెద్ద పరుపులు, దుప్పట్లు, థర్మకోల్ వ్యర్థాలు కుమ్మరించినట్లు తెలిసింది. వీటిని బట్టి నగరవాలకు పర్యావరణంపై గల బాధ్యత తెలుస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో నగరవాసుల్లో పెద్దఎత్తున చైతన్య కార్యక్రమాలు నిర్వహించాలని జీహెచ్ఎంసీ నిర్ణయించింది.
తీరు మారదా..?
నాలాల్లో వ్యర్థాలు వేయొద్దని ప్రధానంగా భవన నిర్మాణ వ్యర్థాలు పడేయొద్దని కోరుతూ నగర వాసులను చైతన్యం చేయడానికి సాఫ్ హైదరాబాద్- షాన్‌దార్ హైదరాబాద్ కార్యక్రమంలో ఈ అంశాన్ని చేర్చారు. నగరంలోని 150 మున్సిపల్ వార్డుల్లో ఒక్కో వార్డు నుంచి 2500 ఇళ్లను ప్రత్యేక లొకేషన్‌గా మొత్తం 3,75,000 ఇళ్లను ఎంపిక చేసి తొలి విడతలో మూడు నెలల్లోగా నూరుశాతం స్వచ్ఛత సాధించడానికి ప్రత్యేక ప్రణాళికలు రూపొందించామని జీహెచ్ఎంసీ కమిషనర్ దానకిశోర్ తెలిపారు. స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, స్వచ్ఛ కార్యకర్తలతో కలిసి ప్రజల్లో అవగాహన పెంచేందుకు చర్యలకు శ్రీకారం చుట్టారు.