హైదరాబాద్‌లో ఇప్పటికే 40కి పైగా చెరువుల్లో గుర్రపు డెక్కలను నియంత్రించేందుకు జీహెచ్‌ఎంసీ అధికారులు డ్రోన్ల సాయంతో ద్రావణాన్ని పిచికారీ చేయిస్తున్నారు. ప్రస్తుతం వర్షాకాలం సమీపించడంతో మరో 36 చెరువులను ప్రక్షాళన చేసే చర్యలు ఆరంభించారు. యుద్ధప్రాతిపదికన గుర్రపుడెక్క తొలగింపు పూర్తిచేయాలని ఎంటమాలజీ విభాగం లక్ష్యంగా పెట్టుకుంది. టెండర్ల ప్రక్రియ తుది దశలో ఉంది. చెరువు విస్తీర్ణం, మొక్క ఏ మేర విస్తరించి ఉందనే అంశాల ఆధారంగా పనులను 5 ప్యాకేజీలుగా విభజించామని, పూర్తి చేసేందుకు గడువు నిర్దేశించామని చీఫ్ ఎంటమాలజిస్టు(సీఈ) డాక్టర్ రాంబాబు స్పష్టం చేశారు.
విస్తీర్ణాన్ని బట్టి.. ప్రస్తుతం పనులు చేపట్టనున్న చెరువులు ఎక్కువ మొత్తంలో మొక్కలు కలిగి ఉన్నాయి. ఉదా: కుమ్మరికుంటనే తీసుకుంటే 4 ఎకరాల మేర, ఎర్రకుంట తటాకంలో 6 ఎకరాలు, గుర్రం చెరువులో 35 ఎకరాలు గుర్రపుడెక్క విస్తరించి ఉంది. మిగిలిన చెరువుల్లోనూ ఇదే పరిస్థితి. మొక్కలను పూర్తిగా తొలగించి జవహర్‌నగర్ డంపింగ్‌యార్డుకు తరలించనున్నారు. చెరువు విస్తీర్ణం 30 ఎకరాల్లోపు ఉంటే నెల, 50ఎకరాల్లోపు ఉంటే 45 రోజులు, అంతకు మించైతే రెండు నెలల్లో పూర్తిచేయాలన్న నిబంధన గుత్తేదారులకు విధించారు.
ప్రధానంగా ఎక్కడంటే..
నల్లచెరువు(ఉప్పల్), కుమ్మరికుంట(హయత్‌నగర్), ఎర్రకుంట(సంతోష్‌నగర్), మల్కం చెరువు(ఖాజాగూడ), గుర్రం చెరువు(బాలాపూర్), మీరాలం ట్యాంకు(బహదూర్‌పుర), హకీంపేట చెరువు, గోల్కొండ సమీపంలోని శాతన్‌తాలాబ్, బోయిన్‌చెరువు, కొత్తచెరువు, పరికిచెరువు, అంబర్‌చెరువు, గోపి చెరువు, రాయసముద్రం, బండ్లగూడ చెరువు, ఇతరత్రా తటాకాలను గుర్రపుడెక్క తొలగింపు కోసం బల్దియా ఎంపిక చేసింది.
ఇవీ చూడండి: రాష్ట్రంలో ఈరోజు 206 మందికి కరోనా