నివాసయోగ్య నగరాల జాబితాపై కేంద్రానిది తప్పుడు విధానమని జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి తెలిపారు. హైదరాబాద్‌కు 24వ స్థానాన్ని ప్రకటించడం సరికాదని అభ్యంతరం వ్యక్తం చేశారు. హైదరాబాద్ ప్రతిష్ఠ దెబ్బతీసేలా ర్యాంకులు ఇచ్చారని ఆరోపించారు. రాజకీయ దురుద్దేశంతోనే ర్యాంక్‌ను తగ్గించారని వ్యాఖ్యానించారు. అన్ని మెట్రో నగరాలను మించి అభివృద్ధిలో దూసుకుపోతున్నామని... ఉత్తమ నగరానికి ఉండాల్సిన అన్ని ప్రమాణాలు హైదరాబాద్‌కు ఉన్నాయని పేర్కొన్నారు.
విద్య, వైద్య, ఆవాసం, తాగునీరు తదితర అంశాలను తెలిపే జీవన ప్రమాణాలకు కేవలం 35 శాతం మార్కులు మాత్రమే ఇవ్వడం.. ఆర్థిక ప్రమాణాలకు 15శాతం మార్కులు ఇవ్వడంలో ఔచిత్యం ఏమని ప్రశ్నించారు. అత్యంత ప్రాధాన్యత ఉన్న పౌర సేవల విభాగాన్ని ఈ సర్వేలో పేర్కొనలేదని తెలిపారు. హైదరాబాద్‌లో అనేక బహుళజాతి సంస్థలు, అంతర్జాతీయంగా ఉన్న ప్రముఖ కంపెనీలు తమ కార్యాలయాలను తెరువడం, జె.ఎల్.ఎల్, మెర్సర్స్ లాంటి సంస్థలు హైదరాబాద్ ఉత్తమ నివాసయోగ్యమైన నగరంగా.. గత ఐదేళ్లుగా వరుసగా ప్రకటించాయని గుర్తుచేశారు. వీటితో పాటు గత ఐదేళ్లుగా హైదరాబాద్ నగరానికి దాదాపు 25కు పైగా పలు జాతీయ, అంతర్జాతీయ అవార్డులు కూడా లభించాయన్నారు.
ఇదీ చూడండి: కరెంట్ పోతోంది... జనరేటర్ వేయండి: జీహెచ్ఎంసీ మేయర్