LED lighting in Hyderabad: ఎల్‌ఈడీ దీపాలతో గడిచిన ఐదేళ్లుగా రూ.418 కోట్లు నిధులు ఆదా అయినట్లు జీహెచ్‌ఎంసీ ప్రకటించింది. విద్యుత్తు ఛార్జీల రూపంలో ఏటా రూ.80 కోట్లకుపైగా నిధులు మిగులుతున్నాయని పేర్కొంది. వీధి దీపాలు, పార్కులు, కూడళ్లు, సుందరీకరణ పనుల కోసం ఉపయోగించే దీపాలతో రహదారులు మెరుస్తున్నాయని, అదే సమయంలో విద్యుద్దీపాల విషయంలో చేస్తోన్న ఖర్చులు గణనీయంగా తగ్గాయని వివరించింది.
4.93లక్షల వీధి దీపాలు..
ఈ ప్రాజెక్టుకు ముందు జీహెచ్‌ఎంసీ ఏటా వంద కోట్ల రూపాయలకు పైగా విద్యుత్తు ఛార్జీలు చెల్లించేది. అప్పట్లో దీపాల సంఖ్య కూడా తక్కువే. చాలా వరకు నెలల తరబడి వెలిగేవి కాదు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఈఈఎస్‌ఎల్(ఎనర్జీ ఎఫిషియన్సీ సర్వీసెస్ లిమిటెడ్) సాయంతో జీహెచ్‌ఎంసీ 2017లో ఎల్‌ఈడీ విద్యుద్దీపాల ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. పాత స్తంభాలన్నింటినీ తొలగించి కొత్త వాటితో అన్ని రోడ్లపై వీధి దీపాలు ఏర్పాటు చేసింది. సుమారు లక్షకుపైగా కొత్త వీధి లైట్లను అందుబాటులోకి తెచ్చింది. అన్నింటినీ నగరవ్యాప్తంగా ఏర్పాటు చేసిన 30వేల సీసీఎంఎస్ సాఫ్ట్‌వేర్ పెట్టెలకు అనుసంధానం చేసింది. దీంతో దీపాలు సాయంత్రం 5.30గంటలకు వెలిగి, ఉదయం 6గంటలకు వాటంతట అవే ఆరిపోతున్నాయి. మరమ్మతుల బాధ్యత ఈఈఎస్‌ఎల్ సంస్థ ఆధ్వర్యంలోని గుత్తేదారులు చూసుకుంటారు. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులనూ ఈఈఎస్‌ఎల్ సంస్థనే పరిష్కరిస్తోంది. వీధి లైట్ల నిర్వహణ చూసే సిబ్బందిని ఇతర విభాగాలకు మళ్లించి ఖర్చులకు అడ్డుకట్ట వేశామని యంత్రాంగం వివరించింది.
ఇదీ చూడండి: ఏసీలు, ఎల్ఈడీల ఉత్పత్తి.. ఇక పూర్తిగా దేశీయంగానే!