కంటైన్మెంట్ జోన్లతో కరోనాను నివారించేందుకు జీహెచ్ఎంసీ పలు చర్యలు చేపడుతోంది. కంటైన్మెంట్ జోన్లలో ప్రత్యేకంగా రెండు సార్లు శానిటైజ్ చేసి... ఇంటింటికి వైద్య సిబ్బంది తిరుగుతూ అందరి ఆరోగ్య పరిస్థితిని పరిశీలిస్తున్నారు. కరోనా లక్షణాలు ఉన్న వారికి వెంటనే వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఎమర్జెన్సీ బృందాలు 24 గంటల పాటు అందుబాటులో ఉంటూ... ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తున్నారు.
హైదరాబాద్‌లో కరోనా కంట్రోల్ రూంను సైతం ఏర్పాటు చేశారు. రోజుకు వందల సంఖ్యలో ఫోన్లు రాగా... ఇవాళ ఒక్క రోజే... ఏకంగా 571 ఫోన్లు వచ్చినట్లు జీహెచ్ఎంసీ తెలిపింది. ఇందులో 4 కరోనా అనుమానిత ఫోన్లు కాగా... 6 అంబులెన్స్ కోసం వచ్చాయి.
ఈ సమయంలో గ్రేటర్లో 32 అంబులెన్స్‌లను పలు లోకేషన్లలో అందుబాటులో ఉంచారు. 491 ఫోన్లు ఆహారం అందించాలని 23 కంటైన్ మెంట్ జోన్లతో పాటు ఇతర ప్రదేశాల నుంచి వచ్చాయి. వికలాంగులకు, వృద్ధుల కోసం అన్నపూర్ణ మొబైల్ ద్వారా 22 వేల 385 మందికి ఆహారం అందించినట్లు ప్రకటనలో పేర్కొన్నారు.