నగరంలోని హైటెక్ సిటీ - కూకట్‌పల్లి మార్గంలో ఉన్న ఫ్లైఓవర్‌పై భారం తగ్గించేందుకు ఎంఎంటీఎస్ రైల్వేస్టేషన్ సమీపంలో నాలుగు లైన్ల రైల్వే అండర్ బ్రిడ్జితో పాటు స్టార్మ్ వాటర్ డ్రెయిన్‌ను నిర్మిస్తున్నట్లు జీహెచ్ఎంసీ కమిషనర్ డీఎస్ లోకేష్ కుమార్ తెలిపారు. ఈ పనులకు ఎస్పీఆర్డీపీ కింద రూ.59.09 కోట్ల నిధులను మంజూరు చేసినట్లు ప్రకటించారు. ట్రాఫిక్‌తో పాటు డ్రైనేజీ సమస్యను పరిష్కరించేందుకు ఈ పనులు చేపట్టినట్లు కమిషనర్ తెలిపారు.
రైల్వే అండర్ బ్రిడ్జి పనులకు రూ. 24.09 కోట్లు, రెండు వైపులా అప్రోచ్ రోడ్లు, స్టార్మ్ వాటర్ డ్రెయిన్ నిర్మాణం, కల్వర్ట్ విస్తరణ పనులకు రూ. 35 కోట్లు కేటాయించినట్లు ఆయన తెలిపారు. ఇందూ ఫార్చూన్ అపార్ట్‌మెంట్ ఎదురుగా బ్రిడ్జి నెం-215 వద్ద ప్రస్తుతం ఉన్న రెండు లైన్ల పైప్ కల్వర్ట్‌ను నాలుగు లైన్లుగా వెడల్పు చేశామన్నారు. వరద నివారణ చర్యల్లో భాగంగా 250 మీటర్ల పొడవున ఆర్సీసీ బాక్స్ డ్రెయిన్ నిర్మించినట్లు తెలిపారు. హైటెక్ సిటీ - కూకట్‌పల్లి మార్గంలో మంజీర పైప్‌లైన్ రోడ్డుకు వెళ్లే వాహనాలకు ప్రత్యామ్నాయ మార్గంగా ఈ రైల్వే అండర్ బ్రిడ్జి ఉపయోగపడుతుందని తెలిపారు.
రైల్వే అండర్ బ్రిడ్జి పోర్షన్ వరకు మిగిలిన పనులను వేగంగా పూర్తిచేయడానికి రైల్వే ఇంజనీరింగ్ విభాగంతో జీహెచ్ఎంసీ ప్రాజెక్ట్స్ విభాగం ఇంజనీరింగ్ అధికారులు సమన్వయంతో పనిచేస్తున్నట్లు కమిషనర్ వివరించారు. నగరంలో చేపట్టిన రైల్వే అండర్ పాస్‌లు, రైల్వే ఓవర్ బ్రిడ్జిల నిర్మాణం పనులను వేగవంతం చేసేందుకు దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్, ఇతర అధికారులతో రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి తారకరామారావు ప్రత్యేకంగా సమావేశమైనట్లు కమిషనర్ గుర్తు చేశారు.
ఇద చదవండి: పాఠశాలల ప్రారంభంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు: విద్యాశాఖ