నగరంలో ప్రతి ఇంటిని ఫొటో తీసి, ఎన్ని అంతస్తులు ఉన్నాయి, వాటిలో ఎన్ని ఇళ్లు ఉన్నాయి, ఆ గృహాలకు ఆస్తిపన్ను మదింపు జరిగిందా.. లేదా ఇలాంటి అనేక ప్రశ్నలకు జవాబిచ్చేలా జీఐఎస్ సర్వే ఉంటుంది. బిల్‌కలెక్టర్లు, ట్యాక్స్ ఇన్‌స్పెక్టర్లు, బల్దియా ఐటీ విభాగం యంత్రాంగం ఈ ప్రక్రియను నిర్వహిస్తోంది. గ్రేటర్‌లో ఈ సర్వే చాలా కాలం క్రితమే మొదలైంది. సాంకేతిక సమస్యలు, ఇతరత్రా అవాంతరాలతో మూడు సార్లు ఆగింది. ఇప్పటి వరకు 2లక్షల ఇళ్ల సర్వే పూర్తయింది. అందులో రెండు వేల నిర్మాణాలకు ఆస్తిపన్ను లేనట్లు తేలింది. మరిన్ని కట్టడాలకు వాస్తవానికన్నా తక్కువ పన్ను ఉన్నట్లు అధికారులు గుర్తించారు. మొదట ఆయా నిర్మాణాలను తనిఖీ చేయాలని తాజాగా కమిషనర్ డి.ఎస్.లోకేష్‌కుమార్ నిర్ణయం తీసుకున్నారు.
ఏర్పాట్లు చేస్తోన్న ఐటీశాఖ
కంప్యూటర్లు, ట్యాబులతో జరిగే జీఐఎస్ సర్వేకు బల్దియా ఐటీ విభాగం ఏర్పాట్లు చేస్తోంది. గతంలో సర్వే చేసిన ఇళ్లను జీహెచ్‌ఎంసీ పరిధి డిజిటల్ పటంపై మ్యాపింగ్ చేశామని, అందులో ఆస్తిపన్ను వసూళ్లను పెంచేందుకు గల మార్గాలను గుర్తించామన్నారు. నగరవ్యాప్తంగా సర్వే చేయాల్సిన నిర్మాణాలు ఇంకా 15లక్షలు ఉన్నాయని ఉన్నతాధికారి తెలిపారు. వాటన్నింటినీ పూర్తిస్థాయిలో 2డీ సర్వేతో డిజిటల్ పటంపై రికార్డు చేస్తామని ఆయన వివరించారు. ఆస్తుల సర్వే పూర్తయితే రూ.200కోట్లకుపైగా ఆస్తిపన్ను ఆదాయం పెరగనుందని ఆయన అంచనా వేశారు.
చార్మినార్ జోన్‌లో భారీగా..
‘‘ప్రస్తుతం చార్మినార్ జోన్ నుంచి తక్కువ ఆస్తిపన్ను వసూలవుతోంది. 2డీ సర్వేతో ఆ సమస్యను అధిగమిస్తాం. అక్కడ పన్ను పరిధిలో లేని నిర్మాణాలు, వాస్తవానికన్నా తక్కువ పన్ను చెల్లించే కట్టడాలకు రెట్టింపు స్థాయిలో ఉన్నాయి. పన్ను మదింపు సరిగా జరగట్లేదు. ఎల్బీనగర్, శేరిలింగంపల్లి జోన్లలోనూ రూ.50కోట్లకుపైగా పన్ను వసూళ్లు పెరగనున్నాయి.’’అని ఐటీ విభాగం ఉన్నతాధికారి ఈనాడు-ఈటీవీభారత్తో తెలిపారు.
ఇదీ చదవండీ : నాగార్జునసాగర్ ఉప ఎన్నిక పోలింగ్