హైదరాబాద్ జంట జలాశయాలైన హిమాయత్‌సాగర్, ఉస్మాన్సాగర్లకు ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరదనీరు చేరగా బుధవారం ఉదయం 12 గంటల ప్రాంతంలో జలమండలి అధికారులు హిమాయత్‌సాగర్ గేట్లు ఎత్తివేసి నీటిని మూసీ నదిలోకి విడుదల చేశారు. ఈమేరకు జలమండలి ఎండీ దానకిశోర్ హిమాయత్‌సాగర్‌ను సందర్శించి వరద పరిస్థితి గురించి అధికారులతో సమీక్షించారు.
హిమాయత్‌సాగర్‌కు 25 వేల క్యూసెక్కుల నీరు పోటెత్తగా ఇప్పటివరకు అధికారులు 13 గేట్లు ఎత్తివేశారు. ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా ముందు జాగ్రత్తగా లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించామని అధికారులు వివరించారు. వీటితో పాటు నగరవ్యాప్తంగా 14 వేల మ్యాన్‌హోళ్లకు సేఫ్టీ గ్రిల్స్ ఏర్పాటు చేశామని నీరు నిలిచే ప్రాంతాల్లో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా బారికేడ్లు ఏర్పాటు చేశామని వివరించారు.
విద్యుత్ వైఫల్యం వల్ల అంతరాయం ఏర్పడిన ప్రాంతాల్లో నీటి సరఫరా తిరిగి ప్రారంభించాలని, అవసరమైన ప్రాంతాలకు ట్యాంకర్ల ద్వారా నీరు సరఫరా చేయాలని ఎండీ దానకిశోర్ పేర్కొన్నారు. రానున్న రెండు రోజుల్లో వర్షాలు పడే సూచనలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలపగా... పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని జీహెచ్ఎంసీ పరిధిలోని జిల్లాల కలెక్టర్లను దానకిశోర్ ఆదేశించారు.
ఇదీ చదవండిః భారీగా వరదనీరు చేరి నిండుకుండలా మారిన హిమాయత్‌సాగర్