GOVERNMENT HOSPITALS: ఇదే పరిస్థితి రాష్ట్రంలోని చాలా ఆసుపత్రుల్లో ఉంది. రోగులుండే వార్డుల్లో శునకాలు తిరుగుతున్నాయి. పరిసరాల్లో భరించలేనంత దుర్వాసన సాధారణమైపోయింది. ఎక్కడబడితే అక్కడ చెత్తాచెదారాన్ని పారవేస్తుండడంతో ఆసుపత్రుల ఆవరణలో అపరిశుభ్రత తాండవిస్తోంది. అనేక చోట్ల మానవ అవయవ వ్యర్థాల నిర్వహణ సైతం లోపభూయిష్టంగా ఉంది. రోగుల సహాయకులు ఆరుబయటే పడుకోవాల్సిన పరిస్థితుల్లో పిల్లులు, పందుల బెడదతో అల్లాడుతున్నారు. రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో పారిశుద్ధ్య సమస్యలపై ‘ఈనాడు- ఈటీవీ భారత్’ క్షేత్రస్థాయి కథనం.
పరిశుభ్రతా.. నీవెక్కడ?
ఉస్మానియా: కులీకుతుబ్‌షా భవనం 4వ అంతస్తులో వ్యర్థాల సంచులను పడేస్తున్నారు. శస్త్రచికిత్స థియేటర్లు, వార్డుల్లో తరచూ రసాయన ప్రక్రియ చేపట్టకపోవడంతో దుర్గంధం నెలకొంటోంది. ఆసుపత్రి ఆవరణలో చెత్తాచెదారాన్ని తొలగించడం లేదు. వార్డుల్లో కుక్కలు, పిల్లుల సంచారం మామూలుగా మారింది. సమీపంలోనే మూసీ నది ఉండడంతో దోమలు స్వైరవిహారం చేస్తున్నాయి.
గాంధీ: పలు విభాగాలకు నెలవైన గాంధీ ఆసుపత్రి సెల్లార్‌లో మ్యాన్‌హోళ్లు తరచూ పొంగిపొర్లుతుండడంతో పరిస్థితి దుర్భరంగా ఉంది. డ్రైనేజీలు పొంగి వంటశాల విస్తరించిన బ్లాక్ మొత్తం మురుగుమయంగా మారింది. పందికొక్కులు, ఎలుకలు చేరి రంధ్రాలు చేస్తున్నాయి. కూరగాయలు తరగడం, వంటలు వండడం, వార్డుల్లోకి తరలించడం వరకూ అంతా ఆ మురికి కూపంలోనే చేయాల్సి వస్తోంది.
మహబూబ్‌నగర్: ఆసుపత్రికి ప్రధాన ద్వారం ఏర్పాటు చేయలేదు. దీంతో ప్రాంగణంలో పందులు, కుక్కలు విచ్చలవిడిగా సంచరిస్తున్నాయి. ఆసుపత్రిలోపల బొద్దింకలు, నల్లులు, ఎలుకల బెడద తీవ్రంగా ఉంది. మురుగునీటి కాలువ నిర్వహణలో సమస్యలుండడంతో ప్రాంగణమంతా దుర్వాసన వెదజల్లుతోంది.
రంగారెడ్డి: జిల్లా ఆసుపత్రిలోని అన్ని వార్డుల్లోనూ ఎలుకలు తవ్విన గుంతలు దర్శనమిస్తున్నాయి. మూషికాలు ఎక్కడ పడితే అక్కడ పైపులను ధ్వంసం చేస్తున్నాయి. మాతా శిశు సంరక్షణ ఆరోగ్య కేంద్రం వెనుక విభాగంలో పిచ్చిమొక్కలు ఏపుగా పెరిగాయి. డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. పాముల సంచారం భయపెడుతోంది.
కరీంనగర్: కరోనా అనుమానిత కేసుల వార్డు, సర్జికల్ వార్డులకు ఇరువైపులా ఉన్న ఓపెన్ డ్రైైనేజీ ద్వారా ఎలుకలు, పాములు వస్తున్నాయి. భరించలేని దుర్వాసనతో రోగులు, సిబ్బంది తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు.ఆసుపత్రికి నలువైపులా గేట్లు తీసి ఉంచడంతో ఆవరణలో కుక్కలు యథేచ్ఛగా తిరుగుతున్నాయి.
ఖమ్మం: జిల్లా ఆసుపత్రి ఆవరణలో కుక్కలు, ఎలుకలు సంచరిస్తున్నాయి. రోగులు, సహాయకులు తిన్న ఆహార పదార్థాలను ఇష్టానుసారంగా పడేస్తున్నారు. కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రి లోపల డ్రైనేజీ వ్యవస్థ బాగోలేక మురుగునీరు ఆవరణలో నిలుస్తోంది. కుక్కలు యధేచ్ఛగా సంచరిస్తున్నాయి. ట్రాన్స్‌ఫార్మర్ సమస్యలతో తరచూ విద్యుత్తు కోత తప్పడం లేదు.
నల్గొండ, సూర్యాపేట: ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో వార్డుల మధ్య చెత్తాచెదారాన్ని, ఖాళీ కొబ్బరిబొండాలు, ఇతర వస్తువులను పడేస్తున్నారు. మురుగు నీరు విడుదలయ్యే పైపులు పగలడంతో దుర్గంధం వెలువడుతోంది. సూర్యాపేట జనరల్ ఆసుపత్రిలో జీవవ్యర్థాల నిర్వహణపై నిర్లక్ష్యంవహిస్తున్నారు. ఇటీవల కుక్కలు కొన్ని అవయవ వ్యర్థాలను వీధుల్లోకి తెచ్చి పడేశాయి. ప్రాంగణంలోనే చెత్తాచెదారం తగులపెట్టడంతో వచ్చే పొగతో వార్డుల్లో రోగులు ఇబ్బంది పడుతున్నారు.
* భువనగిరి జిల్లా ఆసుపత్రిలో వార్డులతో పాటు ప్రాంగణంలో చెత్తాచెదారం నిర్లక్ష్యంగా వదిలి వేస్తున్నారు.
"కొన్ని ఆసుపత్రులు పాత భవనాల్లో కొనసాగుతున్నాయి. పెరిగిన రోగుల తాకిడికి తగ్గట్లుగా అక్కడ డ్రైనేజీ వ్యవస్థ వృద్ధి చేయలేదు. దీంతో అక్కడ పారిశుద్ధ్య సమస్య తలెత్తుతోంది. ఈ లోపాలను చక్కదిద్దేందుకు ఆసుపత్రుల వారీగా సమగ్ర ప్రాజెక్టు నివేదికను సిద్ధం చేయాల్సిందిగా ఇప్పటికే సూపరింటెండెంట్లకు ఆదేశాలిచ్చాం. త్వరలోనే ఆ సమస్యలను పరిష్కరిస్తాం. ప్రస్తుతమున్న పారిశుద్ధ్య విధానంలో లోపాలను సరిచేస్తూ ప్రభుత్వం కొత్త విధానాన్ని తీసుకొచ్చింది. దీని ద్వారా ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన సేవలు లభిస్తాయి. సూపరింటెండెంట్లు, ఆర్‌ఎంఓలు వారానికి రెండుసార్లు ఆసుపత్రి మొత్తాన్ని కలియ తిరగాల్సి ఉంటుంది. ఏరోజుకారోజు నివేదికను రూపొందించాలి."
-డాక్టర్ రమేశ్‌రెడ్డి, వైద్య విద్య సంచాలకులు
ఇదీ చదవండి: increased cooking oil prices: కొనకుండానే సలసల కాగుతున్న వంట నూనెలు
Azadi Ka Amrit Mahotsav: లఖ్‌నవూ ఒప్పందాన్ని తుంగలో తొక్కిన జిన్నా..