Hyderabad Ganja Gang Arrest : మహబూబాబాద్ జిల్లా కురవి మండలం మోదులగూడెనికి చెందిన ధరావత్ పూల్‌సింగ్ సంపాదన కోసం గంజాయి స్మగ్లర్ అవతారమెత్తాడు. ఇతను గతంలో మూడు సార్లు గంజాయి తరలిస్తూ పట్టుబడి జైలు జీవితం గడిపాడు. ఇటీవల బయటకొచ్చిన అతను కమీషన్ల కోసం మహారాష్ట్రకు గంజాయి తరలించడం ప్రారంభించాడు. సోలాపూర్‌కు చెందిన లింబాలి అనే వ్యక్తి 160 కిలోల గంజాయి కోసం పూల్‌సింగ్‌కు ఆర్డర్ ఇచ్చాడు. దీని తరలింపు కోసం ఇతను మరో ముగ్గురు వ్యక్తులను జత చేసుకున్నాడు.
ఆంధ్రప్రదేశ్‌లోని అప్పర్ సీలేరుకు చెందిన బాలేశ్ వద్ద 160 కిలోల గంజాయి తీసుకుని రెండు కార్లలో హైదరాబాద్ మీదుగా మహారాష్ట్రకు బయల్దేరారు. అయితే హైదరాబాద్ సమీపంలో ఈ ముఠాను ఎస్వోటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 50 లక్షల విలువైన 160 కిలోల గంజాయి, రెండు కార్లు, నాలుగు ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని రాచకొండ సీపీ చౌహాన్ తెలిపారు
Ganja Gang Arrest In Hyderabad : వీరితో పాటు యాచారం పరిధిలో మరో ముఠాను ఎస్వోటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నగరంలోని బడాబజార్‌కు చెందిన క్యాబ్ డ్రైవర్ మహ్మద్ ఫిరోజ్, కార్వాన్‌కు చెందిన ఆటో డ్రైవర్ దినేశ్‌సింగ్ ఇద్దరూ మంచి స్నేహితులు. అడ్డదారిలో సంపాదించాలన్న ఆలోచనతో ఇద్దరూ గంజాయి స్మగ్లర్ల అవతారం ఎత్తారు. కొన్నేళ్లుగా ఇద్దరూ తరచూ ఏపీలోని అప్పల్ సీలేరుకు చెందిన గంజాయి సరఫరాదారులతో పరిచయాలు పెంచుకుని నగరానికి తీసుకొచ్చి విక్రయిస్తున్నారు.
తాజాగా వీరికి మహారాష్ట్రలోని బుల్దానా నగరానికి చెందిన ఠాకూర్ 220 కిలోల గంజాయి ఆర్డర్ ఇచ్చాడు. దీంతో మహ్మద్ ఫిరోజ్ మరి కొందరిని జత చేసుకున్నారు. రెండు కార్లలో మెుత్తం ఐదుగురు ఏపీలోని సీలేరు వెళ్లి.. ముకుంద్ అనే వ్యక్తి వద్ద 240 కిలోల గంజాయిని కొనుగోలు చేసి... మహారాష్ట్రకు బయల్దేరారు. హైదరాబాద్‌లోని యాచారం వద్ద ఎస్వోటీ పోలీసులు వీరిని అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద రూ.65 లక్షల విలువైన 220 కిలోల గంజాయి, 2కార్లు, 5 ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.
'ధరావత్ పూల్‌సింగ్, పాషా వీరు చాలా సంవత్సరాల నుంచి గంజాయి స్మగ్లింగ్ చేస్తున్నారు. వీరిపై మూడు ఎన్డీపీఎస్ కేసులు కూడా ఉన్నాయి అయిన వీరిలో ఎలాంటి మార్పు లేదు. ఇప్పుడు కొత్తగా సీలేరు నుంచి తీసుకువచ్చి మహారాష్ట్రకి సప్లై చేయడం ప్రారంభించారు. వారి వాహానాన్ని తనిఖీ చేస్తే 160కిలోల గంజాయిని దొరికింది. ఇప్పుడు ఐదుగురిని అరెస్ట్ చేయడం జరిగింది. గతంలో కూడా వీరిపై కేసులు ఉన్నాయి.' -డీఎస్ చౌహాన్, రాచకొండ సీపీ
యువత గంజాయికి అలవాటు పడి తమ జీవితాలను నాశనం చేసుకోవద్దని సీపీ చౌహాన్ తెలిపారు. తల్లిదండ్రులు పిల్లల నడవడికలపై దృష్టిసారించాలని విజ్ఞప్తి చేశారు. ఒకవేళ బానిసలయ్యారని తెలిస్తే వెంటనే కౌన్సిలింగ్ సెంటర్లుకు తీసుకెళ్లాలని సూచించారు.
ఇవీ చదవండి: