Gangula Kamalakar review of paddy procurement: ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ధాన్యం కొనుగోళ్లు సజావుగా సాగుతున్నాయని పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. హైదరాబాద్ మంత్రుల నివాస ప్రాంగణంలోని తన నివాసంలో వానాకాలం ధాన్యం కొనుగోళ్లపై మంత్రి ఉన్నత స్థాయి సమీక్ష చేశారు. రాష్ట్రంలో ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్‌లో ధాన్యం సేకరణ, కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు, పురోగతి, ఇతర ఇబ్బందులపై విస్తృతంగా చర్చించారు.
ఈ సందర్భంగా ధాన్యం కొనుగోళ్లపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. క్షేత్రస్థాయిలో మాయిశ్చర్ మిషన్లు, ప్యాడీ క్లీనర్లు, గన్నీ సంచులు సరిపడినంత అందుబాటులో ఉన్నాయని తెలిపారు. కొనుగోలు కేంద్రాల్లో ఎలాంటి సమస్యలు లేకుండా చూడాలని అధికారులకు ఆయన ఆదేశించారు. ధాన్యం కొనుగోళ్లు గత సంవత్సరం ఇదే రోజుతో పోలిస్తే దాదాపు 83 వేల మెట్రిక్ టన్నులు ఎక్కువగా సేకరించామని తెలిపారు.
ఈరోజు వరకూ లక్ష 32వేల 989 మంది రైతులు నుంచి 8.93 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించగా.. ఇందుకోసం 2.23 కోట్ల గన్నీ బ్యాగులు వినియోగించామని అన్నారు. ధాన్యం పూర్తి సేకరణకు అవసరమైన గన్నీ బ్యాగులకు ఏ ఇబ్బంది లేదని అన్నారు. నవంబర్, డిసెంబరు మాసాల్లోనే వానా కాలం ధాన్యం సేకరణ అధికంగా జరుగుతుందని ఆయన గుర్తు చేశారు.
రాష్ట్ర వ్యాప్తంగా వరి పంట కోతలకు అనుగుణంగా ఇప్పటి వరకూ 4579 కొనుగోలు కేంద్రాలు తెరిచామని.. అవసరాల మేరకు అదనపు కేంద్రాలు ఏర్పాటు చేసుకోవడానికి జిల్లా యంత్రాంగానికి ఆదేశాలు ఇచ్చామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం సూచించిన విధంగా రైతులు తేమ లేకుండా ఆరబెట్టిన నాణ్యమైన ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని సూచించారు.
కేంద్రాలకు వచ్చిన ధాన్యాన్ని వెంట వెంటనే సేకరిస్తారని వివరించారు. దేశంలో కేవలం తెలంగాణ మాత్రమే కనీస మద్ధతు ధరల ప్రకారం.. గ్రేడ్ ఏ క్వింటాల్ ధర రూ. 2,060, సాధారణ రకం రూ.2,040 చొప్పున చెల్లిస్తూ రైతుల నుంచి ధాన్యం సేకరిస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పౌరసరఫరాల శాఖ కమిషనర్ వి.అనిల్‌కుమార్, డిప్యూటీ కమిషనర్ రుక్మిణి, పౌరసరఫరాల సంస్థ జీఎం రాజారెడ్డి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఇవీ చదవండి: