హైదరాబాద్ అంబర్‌పేట తిలక్‌నగర్ పరిధిలోని గంగ గౌరిశ్వర భజన మండలి కార్యాలయంలో అంతర్జాతీయ మత్స్యకార దినోత్సవం సందర్భంగా గంగపుత్ర దివస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. గంగపుత్ర దివస్ వేడుకల్లో పాల్గొనడం పట్ల ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ హర్షం వ్యక్తం చేశారు.
ఎంతో సంతృప్తి..
జన్మతా చేపలు పట్టే బెస్త కులంలో పుట్టిన తాను గంగపుత్ర దివస్ వేడుకల్లో పాల్గొనడం ఎంతో సంతృప్తిగా ఉందని ఎమ్మెల్యే గోపాల్ అన్నారు.
ఇకపై ఏటా..
ఇకపై ఏటా మత్స్యకార దినోత్సవాన్ని గంగపుత్ర దివస్ పేరిట నిర్వహిస్తామని గంగ తెప్పోత్సవం, గంగా గౌరీశ్వర భజన మండలి ఛైర్మన్ పూస నరసింహ బెస్త వెల్లడించారు.హైదరాబాద్ పరిధిలో సంచార మత్స్య విక్రయ వాహనాలు కేవలం మత్స్య సహకార సంఘాల వారికే ఇవ్వాలని నరసింహ డిమాండ్ చేశారు.
అదే మా ఉద్దేశం..
మత్స్యకార వృత్తి గంగపుత్రులదేనని నేటి సమాజానికి తెలియజేయడమే తమ ఉద్దేశమన్నారు. ఎన్ని తరాలు మారినా కుల వృత్తి మారదని.. ఇతర కులాల వారు తమ కుల సంపదను, చరిత్రను చెరబట్టడాన్ని నరసింహ తీవ్రంగా ఖండించారు.
పెద్ద ఎత్తున పథకాలు కావాలి..
గంగపుత్ర యువతకు జీవనోపాధి కోసం మత్స్యశాఖ నుంచి పెద్ద ఎత్తున నూతన పథకాలు రావాలని ఆయన ఆకాంక్షించారు. మత్స్య సహకార సంఘాలకు రాయితీలు, సబ్సిడీలు పెంచాలన్నారు. మత్స్య మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు ఇవ్వాలన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గంగపుత్రులకు అన్యాయం చేస్తున్నాయని నరసింహ ఆందోళన వ్యక్తం చేశారు. గండిపేట చెరువు వద్ద గంగ తెప్పోత్సవం భారీ ఎత్తున నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. గంగమ్మ తల్లికి గండిపేటలో తాము చేసిన ప్రత్యేక పూజల వల్లే హైదరాబాద్‌లో వరదలు తగ్గుముఖం పట్టాయని నరసింహ గుర్తు చేశారు.
చేపల మార్కెట్ కోసం..
అంబర్‌పేటలో గంగపుత్రల కోసం చేపల మార్కెట్ కట్టించాలని అహర్నిశలు కృషి చేస్తున్నట్లు శ్రీ గంగపుత్ర సంఘం అధ్యక్షుడు కాపరవేని లింగం బెస్త పేర్కొన్నారు. కార్యక్రమంలో సంఘం ప్రధాన కార్యదర్శి నర్సింగ్ రావు బెస్త , యువజన అధ్యక్షుడు ధర్మేందర్ బెస్త , సలహా దారుల కమిటీ, ఆఫీసు బేరర్లు, గంగపుత్ర సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.