హైదరాబాద్ అంబర్‌పేటలో తెలంగాణ గంగపుత్ర చైతన్య సమితి ద్వితీయ వార్షికోత్సవ సదస్సును గంగా గౌరీశ్వర భజన మండలి సమావేశ మందిరంలో ఘనంగా నిర్వహించారు.
గంగపుత్ర కుల స్థితిగతులపై సంఘం అధ్యక్షుడు పూస సత్యనారాయణ బెస్త అధ్యక్షతన సమితి నేతలు చర్చించారు. అనంతరం జీహెచ్ఎంసీ పరిధిలో 150 సంచార మత్స్య విక్రయ వాహనాలను ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీలకు కేటాయిస్తామనడం అన్యాయమని సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు.
గంగపుత్ర దివస్ జరుపుకోవాలి..
రాష్ట్ర వ్యాప్తంగా శనివారం అంతర్జాతీయ మత్స్యకార దినోత్సవం సందర్భంగా అన్ని గంగపుత్ర సంఘాలు గంగపుత్ర దివస్‌గా జరుపుకోవాలని సత్యనారాయణ కోరారు. చైతన్య సమితి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహిస్తామని వివరించారు. తమ కుల దైవం గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తామని పేర్కొన్నారు.
సొసైటీల ద్వారానే అందించాలి..
మత్స్య పారిశ్రామిక సహకార సొసైటీల ద్వారానే ఆ వాహనాలు అందించాలని స్పష్టం చేశారు. లేకుంటే మత్స్య పారిశ్రామిక సహకార సంఘాల నేతలతో మత్స్యభవన్ను ముట్టడిస్తామని ఆయన హెచ్చరించారు.
ఇతర కులాలకు ఎలా ఇస్తారు..
సంచార మత్స్య విక్రయ వాహనాలను సాంప్రదాయ మత్స్యకారులకు కాకుండా ఇతరులకు ఎలా కేటాయిస్తారని గంగ తెప్పోత్సవం, గంగా గౌరీశ్వర భజన మండలి ఛైర్మన్ పూస నరసింహ బెస్త ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. ఇది ముమ్మాటికి ప్రభుత్వ ఎన్నికల కుట్రగా నరసింహ అభివర్ణించారు. ఇప్పటికైనా సర్కార్ తన వైఖరి మార్చుకుని హైదరాబాద్ మత్స్య సహకార సంఘాల ద్వారానే సంచార వాహనాలను అందజేయాలని నరసింహ డిమాండ్ చేశారు.
సమావేశంలో ప్రధాన కార్యదర్శి శంకర్ గంగపుత్ర, ముఖ్య సలహాదారులు నర్సయ్య బెస్త, ఉపాధ్యక్షులు శ్రీనివాస్ బెస్త, సురేష్ బెస్త , నర్సింగ్ బెస్త, బద్రినాథ్ గంగపుత్ర, జగన్ గంగపుత్ర, ముత్తన్న గంగపుత్ర, దీపక్ బెస్త తదితరులు పాల్గొన్నారు.