Revanth reddy on Gadwala joinings : గద్వాల జిల్లా కాంగ్రెస్‌కు కంచుకోటగా ఉందని.. ఈసారి జరిగే ఎన్నికల్లో గద్వాల జిల్లాలో కాంగ్రెస్ జెండా ఎగురుతుందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. గద్వాల జిల్లా అమ్మగారి బంగ్లాలో బందీ అయ్యిందని.. ప్రజలను బంగ్లా ముందు బానిసలుగా మార్చారని విమర్శించారు. పాలమూరు వెనకబడ్డ జిల్లా కాదని.. వెనుకబడిన వారిని నడిపించే జిల్లా అని చాటాలని పిలుపునిచ్చారు. పీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు మల్లు రవి సమక్షంలో.. గద్వాల జిల్లా పరిషత్ ఛైర్మన్ సరిత.. ఆమె భర్త తిరుపతయ్య ఆధ్వర్యంలో గద్వాల నియోజకవర్గానికి చెందిన పలువురు బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్లో చేరారు.
పార్టీలో చేరిన 30మంది సర్పంచ్‌లు, 12 మంది ఎంపీటీసీలతో పాటు పలువురు నాయకులకు రేవంత్రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. గద్వాల నియోజకవర్గంలో కాంగ్రెస్ హయాంలో కొందరు నేతలు పదవులు అనుభవించి.. తర్వాత బీఆర్‌ఎస్‌లోకి, మరొకరు బీజేపీలోకి పోయినంత మాత్రాన కాంగ్రెస్ పార్టీ బలహీనపడదని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
బలహీనవర్గాలెప్పుడూ కాంగ్రెస్ వైపే ఉంటారని పేర్కొన్నారు. పాలమూరు బిడ్డకు సోనియాగాంధీ పీసీసీ పదవి ఇచ్చి గౌరవించారన్నారు. కేసీఆర్ బలమైన నాయకులను ఒక్కొక్కరిని అడ్డు తొలగించుకున్నారని పేర్కొన్నారు. పాలమూరు జిల్లాలో 14కు 14 కాంగ్రెస్ గెలిపించుకుందామని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టులను పూర్తి చేసుకుందామన్నారు.
కేసీఆర్‌కు తన పాలనపై నమ్మకం ఉంటే గజ్వేల్ నుంచి పోటీ చేయాలని సిట్టింగ్‌లందరికి సీట్లు ఇవ్వాలని సవాల్ విసిరారు. వందరోజులు కష్టపడాలని కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిచ్చిన అయన.. కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందన్నారు. ఇందిరమ్మ రాజ్యం అధికారంలోకి వస్తేనే పేదలందరికి డబుల్ బెడ్రూం ఇల్లు వస్తాయి. అట్టడుగు వర్గాల వారికి న్యాయం జరుగుతుందని తెలిపారు. రైతులకు 24గంటల ఉచిత విద్యుత్, రెండు లక్షల రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారు.
‘‘గద్వాల జిల్లా కాంగ్రెస్ కంచుకోట. ఈ సారి జరిగే ఎన్నికల్లో గద్వాల జిల్లాలో కాంగ్రెస్ జెండా ఎగురుతుంది. పాలమూరులో అన్ని ఎమ్మెల్యే స్థానాల్లో కాంగ్రెస్‌ను గెలిపిద్దాం. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే పాలమూరు ఎత్తిపోతల పూర్తి చేస్తాం. కేసీఆర్‌కు తన పాలనపై నమ్మకం ఉంటే.. సిట్టింగులందరికీ సీట్లివ్వాలి. కేసీఆర్ గజ్వేల్ నియోజకవర్గంలో పోటీ చేయాలి. కాంగ్రెస్ శ్రేణులు వందరోజులు కష్టపడితే.. అధికారం మనదే అవుతుంది". - రేవంత్ రెడ్డి, టీపీసీసీ చీఫ్
ఇవీ చదవండి: