ఏపీలోని చిత్తూరు జిల్లా మదనపల్లె గ్రామీణ మండలం వలసపల్లెలో అమానవీయ ఘటన జరిగింది. కరోనాతో మరణించాడన్న అనుమానంతో మృతదేహాన్ని ఖననం చేయకుండా అడ్డుకున్నారు ఐదు గ్రామాల ప్రజలు.
మదనపల్లెలోని ఈశ్వరమ్మ కాలనీ వాసి(43) ఇటీవల అస్వస్థతకు గురయ్యాడు. వారం రోజులుగా ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నాడు. అతను ఊపిరి తీసుకోవడం కష్టంగా ఉండటంతో... వైద్యులు తిరుపతికి రిఫర్ చేశారు. అనంతరం కుటుంబ సభ్యులు అతన్ని తిరుపతికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. మృతదేహాన్ని మండలంలోని వలసపల్లెలో ఖననం చేసేందుకు మృతుని బంధువులు ప్రయత్నించారు. అయితే అతను కరోనాతో చనిపోయి ఉంటాడనే అనుమానంతో ఖననం చేయడాన్ని పరిసర గ్రామస్థులు అడ్డుకున్నారు.
కొవిడ్ పరీక్షలు నిర్వహించి నెగెటివ్ తేలితేనే ఇక్కడ ఖననం చేయాలని తేల్చిచెప్పారు. చేసేదేమీ లేక పోలీసులు, వైద్య సిబ్బందికి సమాచారమిచ్చారు మృతుని బంధువులు. పోలీసులు వచ్చినా వైద్య సిబ్బంది రాలేదు. మృతదేహంతో ఉదయం నుంచి బంధువులు వేచి చూస్తున్నారు.
ఇవీచూడండి: మహంకాళి అమ్మవారికి ఆ ఇంటి నుంచి తొలి బోనం