హైదరాబాద్‌లో గతేడాది కన్నీళ్లింకా ఇంకక ముందే వరద మళ్లీ ముంచేందుకు సిద్ధమవుతోంది. గత అయిదు రోజుల్లో కురిసిన వానలకు జీడిమెట్ల ఫాక్స్‌సాగర్ నిండుతోంది. తూము నుంచి విడుదలైన నీటితో కింది ప్రాంతంలో ఉన్న సుభాష్‌నగర్ చివరి బస్టాండ్ వరకు వరద నీరు చేరింది. కట్టను ఆనుకొని ఉన్న చిన్న పరిశ్రమలు, ఓ గుర్రాల షెడ్డు పూర్తిగా నీట మునిగాయి. ఇక్కడ బస్టాండ్ ప్రాంతంలో దాదాపు 40 కుటుంబాలు గుడిసెలు వేసుకుని నివాసముంటున్నాయి. రాత్రి వరద నీరు చేరడంతో గుడిసెలన్నీ పూర్తిగా నీటమునిగాయి. దీంతో రాత్రి నుంచి కంటి మీద కునుకు లేదని.. పస్తులుంటున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కూలీలు. చెరువు నుంచి వస్తున్న నీళ్లను తరలించేందుకు ఓ ప్రైవేటు సంస్థ రెండు భారీ గుంతలు తీయించి వాటిలోకి నీటిని మళ్లిస్తోంది.
ఇంకొంచెం పెరిగితే..!
గతేడాది అక్టోబరులో కురిసిన వర్షాలకు ఎగువ ప్రాంతాల నుంచి వచ్చిన నీరంతా చెరువులోకి చేరింది. దీని సామర్థ్యం 38 అడుగులు కాగా.. 33 అడుగులకు చేరితేనే పైనున్న ఉమామహేశ్వరకాలనీ దాదాపు మూణ్నెళ్ల పాటు నీట మునిగింది. కిందనున్న సుభాష్‌నగర్, జీడిమెట్ల, షాపూర్‌నగర్ గల్లీల్లో ఇళ్లలోకి నీరు చేరింది. గత అయిదు రోజులుగా కురుస్తున్న వానలకు శుక్రవారం రాత్రికి ఈ నీటిమట్టం 26 అడుగులకు చేరింది. ఇది ఇంకొంచెం పెరిగితే కిందనున్న ప్రాంతాలతో పాటు మరోసారి ఉమామహేశ్వర కాలనీకి ప్రమాదం తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఇదీ చదవండి: ఆ వేలం ఆపెయ్యండి.. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు