హైదరాబాద్ నాంపల్లిలోని టీఎన్జీవో కేంద్ర కార్యాలయం ముందు ఏపీలో పనిచేస్తున్న తెలంగాణ నాల్గో తరగతి ఉద్యోగులు ఆందోళన నిర్వహించారు. ఏపీకి కేటాయించిన తెలంగాణ ఉద్యోగులను వెనక్కి రప్పించడంలో... టీఎన్జీవో పూర్తిగా విఫలమైందని విమర్శించారు. తమను స్వరాష్ట్రానికి తీసుకురావాలని నినాదాలు చేశారు. తెలంగాణ వస్తే ఉద్యోగుల సమస్యలన్నీ పరిష్కారవుతాయంటూ.. ఉద్యోగులందరినీ కలుపుకొని ఉద్యమాలు చేసిన ఉద్యోగ సంఘ నేతలు ఇప్పుడెక్కడికి వెళ్లారంటూ ప్రశ్నించారు.
తెలంగాణ ఉద్యమ సమయంలో ముందుండి పోరాడింది తామేనని... గత ఆరేళ్లుగా హైదరాబాద్ నుంచి అమరావతికి ప్రయాణిస్తూ... స్వరాష్ట్రానికి తిరిగి వస్తామనే ఆశతో ఉన్నామన్నారు. ఇప్పటి వరకు అమరావతికి ప్రయాణిస్తూ 38 మంది ప్రమాదం, గుండె పోటుతో ప్రాణాలు కూడా కోల్పోయారని తెలిపారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఏపీలో పనిచేస్తున్న 480 మంది తెలంగాణ ఉద్యోగులను స్వరాష్ట్రానికి తీసుకొచ్చేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: గోల్డెన్ హవర్లో అత్యవసర వైద్యానికి చర్యలు: సీఎస్