సులభంగా డబ్బు సంపాదించేందుకు పాతబస్తీకి చెందిన కొందరు ముఠాగా ఏర్పడ్డారు. ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు వీరి కన్ను ఆసరా పింఛన్‌పై పడింది. అడిగే వారే ఉండరు కదా అని అందిన కాడికి అడ్డంగా దోచుకుని కటకటాల పాలయ్యారు. హైదరాబాద్ చార్మినార్ పరిధిలో ఆసరా పింఛన్ల స్కాం జరిగింది. ఓల్డ్ సిటీకి చెందిన ఇమ్రాన్, సోహెల్, అస్లాం, మోహిన్లు ముఠాగా ఏర్పడి పింఛను సొమ్మును స్వాహా చేశారు.
ఆసరా పింఛన్ పంపిణీకి సంబంధించిన ఐడి, పాస్‌వర్డ్‌లను సంపాదించి... అసలు లబ్ధిదారులతో పాటు.. కొంతమంది అనర్హత కలిగిన వారిని లబ్ధిదారులుగా నమోదు చేశారు. దాదాపు 4 నెలలుగా 255 మంది పేర్లపై పింఛన్ సొమ్మును దారి మళ్లించారు.
ఎలా దొరికారు..?
ఆసరా పింఛన్లో జరిగిన మోసాలపై హైదరాబాద్ ఆర్డీవో పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఓల్డ్సీటీకి చెందిన నలుగురిని అదుపులోకి తీసుకున్నట్లు భాగ్యనగరం సీసీఎస్ జాయింట్ సీపీ అవినాష్ మహంతి తెలిపారు. తహసీల్దార్ ఐడి ,పాస్‌వర్డ్‌ల ద్వారా లబ్ధిదారుల పేర్లు, అకౌంట్ ఇతర వివరాలను మార్చేవారని.. వీరికి ప్రభుత్వ విభాగంలో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న... ముఠాలో సభ్యుడైన అస్లాం సహకరించినట్లు వివరించారు.
ఈ స్కాములో నిందితులు దాదాపు రూ.25 లక్షలు కాజేసినట్లు జాయింట్ సీపీ వెల్లడించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన చార్మినార్ తహసీల్దార్‌ను హైదరాబాద్ కలెక్టర్ కార్యాలయానికి అటాచ్ చేసినట్లు సమాచారం.
ఇదీ చూడండి: పింఛన్లు పక్కదారి... మరి పైసలు ఎవరి ఖాతాల్లోకి...?