Konda Visveshwar Reddy on Party Change : తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. రాజకీయం మెల్లిమెల్లిగా వేడెక్కుతోంది. నేతల చేరికలపై ప్రధానంగా దృష్టి పెడుతున్న ప్రధాన పార్టీలు.. వారిని ఆకర్షించే పనిలో పడ్డాయి. మరోవైపు మరికొందరు నేతలపై పార్టీ మారుతున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతుండగా.. వారు మీడియా ముందుకు వచ్చి వివరణలు ఇచ్చుకోవాల్సి వస్తోంది.
ఇప్పటికే పొంగులేటి, జూపల్లి వంటి నేతలపై పార్టీ మారుతున్నట్లు ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ఆ కోవలోకి చేరారు మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర రెడ్డి. ఆ వార్తలను ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. తాను ఎక్కడికీ వెళ్లడం లేదని.. పార్టీ మారడం లేదని స్పష్టం చేశారు. కొందరు అదే పనిగా పెట్టుకొని తనపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. తాను బీజేపీలోనే కొనసాగుతానని స్పష్టం చేశారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ను ఓడించ గల సత్తా ఉన్న పార్టీ బీజేపీ మాత్రమేనని విశ్వాసం వ్యక్తం చేశారు.
ప్రజలు సైతం ఇదే నమ్ముతున్నారని కొండా విశ్వేశ్వర రెడ్డి అన్నారు. బీజేపీ నేతలు ఒక సిద్ధాంతానికి కట్టుబడి ఉంటారని పేర్కొన్నారు. ఎన్నికల అనంతరం బీజేపీ నేతలు అధికార పార్టీలోకి వెళ్లరని తెలిపారు. దానికి తాను కూడా కట్టుబడి ఉంటానని స్పష్టం చేశారు. కమలం పార్టీ అన్ని వర్గాల పార్టీ అని తెలిపారు. ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణపై స్పందించిన ఆయన.. బీఆర్ఎస్తో అంతర్గత ఒప్పందం లేదని నిరూపించుకోవాలంటే కవితను అరెస్టు చేయాలని కొందరు అంటున్నారని.. ఆమెను అరెస్టు చేయడం తమ చేతుల్లో లేదని.. చట్టం తన పని తాను చేసుకుపోతుందని వ్యాఖ్యానించారు.
"ఆర్‌ఎస్‌ఎస్ తెలంగాణలో పుట్టింది. నేను ఏ పార్టీలోకి వెళ్లడం లేదు. తెలంగాణలో బీజేపీపై ప్రజలకు నమ్మకం ఉంది. రాష్ట్రంలో బీఆర్ఎస్ను ఓడించ గల పార్టీ బీజేపీ మాత్రమే అని ప్రజలు నమ్ముతున్నారు. బీజేపీకి ఒక సిద్ధాంతం ఉంది. దానికి నేను కట్టుబడి ఉంటాను. బీఆర్ఎస్తో అంతర్గత ఒప్పందం లేదని నిరూపించుకోవాలంటే కవితను అరెస్టు చేయాలని కొందరు అన్నారు. కవితను అరెస్ట్ చేయడం సీబీఐ చూసుకుంటుంది. మా పార్టీకి సంబంధం లేదు."- కొండా విశ్వేశ్వర రెడ్డి, మాజీ ఎంపీ
ఇవీ చదవండి: