రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలోని అసమ్మతి నేతలపై ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే ఎరవత్రి అనిల్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ పార్టీని, రేవంత్ రెడ్డిని బలహీనపర్చే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. ఈ నెల 26 నుంచి పాదయాత్ర చేయాలని కాంగ్రెస్ పార్టీ ప్రణాళిక సిద్ధం చేస్తుంటే.. పాదయాత్రను దెబ్బతీయాలని అసమ్మతి నేతలు చూస్తున్నారని ధ్వజమెత్తారు. ఇప్పుడు పార్టీ ముసుగు వీరులు బయటకు వచ్చారని మండిపడ్డారు.
ఈ క్రమంలోనే గతంలో 12 మంది ఎమ్మెల్యేలు పార్టీని వీడినప్పుడు 'సేవ్ కాంగ్రెస్' ఎందుకు గుర్తు రాలేదని.. ఆనాడు పీసీసీగా ఉన్న వాళ్లు ఏం చేశారని అనిల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మునుగోడు ఉప ఎన్నికల్లో కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పార్టీకి వ్యతిరేకంగా పని చేస్తే ఉత్తమ్ ఏం చేశారని ప్రశ్నించారు. సీనియర్లు పార్టీ కోసం పని చేస్తే మునుగోడులో 50 వేల ఓట్లతో గెలిచే వాళ్లమని పేర్కొన్నారు.
సమాచారం లేదనేది అబద్ధం..: సునీల్ కనుగోలు కార్యాలయంపై దాడి జరిగితే సీనియర్లు ఎక్కడికి పోయారని అనిల్ నిలదీశారు. అసమ్మతి నేతల లోపాయికారి ఒప్పందం బీజేపీతోనా లేక టీఆర్‌ఎస్‌తోనా అని ప్రశ్నించారు. కార్యకర్తల మనోధైర్యాన్ని దెబ్బతీస్తున్నారని దుయ్యబట్టారు. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తన స్వార్థం కోసం టీడీపీతో పొత్తు పెట్టుకోలేదా అని ప్రశ్నించిన ఆయన.. ఈ రోజు టీడీపీ నుంచి వచ్చిన వాళ్లకు పదవులు ఎందుకని తిడతారా.. ఇది మీకు న్యాయమా అంటూ ఉత్తమ్‌ను ఉద్దేశించి అన్నారు. సీఎల్పీ నేత భట్టికి కమిటీల సమాచారం లేదనేది అబద్ధమని స్పష్టం చేశారు.
ముసుగువీరులు బయటకొచ్చారు. రేవంత్ చేసే పాదయాత్రను దెబ్బ తీయాలని చూస్తున్నారు. కాంగ్రెస్, రేవంత్‌ను బలహీనపరిచే కుట్ర జరుగుతోంది. 12 మంది ఎమ్మెల్యేలు పార్టీని వీడినప్పుడు 'సేవ్ కాంగ్రెస్' ఎందుకు గుర్తు రాలేదు? మునుగోడు ఉప ఎన్నికల్లో కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పార్టీకి వ్యతిరేకంగా పని చేస్తే ఉత్తమ్ ఏం చేశారు? సీనియర్లు పార్టీ కోసం పని చేస్తే మునుగోడులో గెలిచేది. సీఎల్పీ నేత భట్టికి కమిటీల సమాచారం లేదు అనేది అబద్ధం. - ఎరవత్రి అనిల్, మాజీ ఎమ్మెల్యే
ఇవీ చూడండి..
పీసీసీ కమిటీల చిచ్చు.. కాంగ్రెస్‌లో ఒరిజినల్ వర్సెస్ వలస
రాహుల్ వ్యాఖ్యలపై భాజపా ఫైర్.. పార్టీ నుంచి తొలగించాలని ఖర్గేకు డిమాండ్