రాష్ట్రంలో పంటల కొనుగోళ్లలో భారీ కుంభకోణం జరిగిందని మాజీ మంత్రి షబ్బీర్ అలీ ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం వివిధ పంటలను కొనుగోలు చేసి.. విక్రయించడంపై ఉన్నత స్థాయి దర్యాప్తు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వివిధ పంటలు కొనుగోలు చేయడం వల్ల దాదాపు రూ. 7,500 కోట్ల నష్టాన్ని ప్రభుత్వం భరించిందని ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వాదన చాలా అనుమానాస్పదంగా ఉందన్నారు. నష్టాల పేరుతో ఒక పెద్ద కుంభకోణాన్ని కప్పిపుచ్చడానికి సీఎం యత్నిస్తున్నారని ఆక్షేపించారు.
కనీస మద్దతు ధరలు చెల్లించి పంటలను కొనుగోలు చేయడం ద్వారా ప్రభుత్వం ఎలాంటి సహాయం చేయలేదని షబ్బీర్ అలీ పేర్కొన్నారు. రైతుల నుంచి సేకరించిన వివిధ పంటల వివరాలు, కొనుగోలుదారుల జాబితాతో పాటు శ్వేతపత్రాన్ని విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. తెరాస నాయకులు, రైతుబంధు సమితి సభ్యులు, వ్యవసాయ అధికారులు, ఇతర సంబంధిత విభాగాలు వ్యవసాయ ఉత్పత్తులను ఎంపిక చేసిన కొనుగోలుదారులకు తక్కువ ధరలకు విక్రయించడానికి కుట్ర పన్నాయని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. గత సీజన్లో రాష్ట్ర ప్రభుత్వ అన్ని పంటల సేకరణ, అమ్మకం రెండింటిలోనూ సమగ్ర దర్యాప్తు జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు.
ఇదీ చూడండి: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను మోసం చేస్తున్నాయి: ఉత్తమ్