రోజురోజుకూ కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నందున గ్రేటర్ హైదరాబాద్ పరిధి, పరిసర జిల్లాల్లో ఆరోగ్య అత్యవసర పరిస్థితిని విధించాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. గడిచిన 2 వారాల్లో గ్రేటర్ హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా పెరిగిందని మాజీ మంత్రి షబ్బీర్ అలీ ఓ ప్రకటనలో ఆందోళన వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో మే 31 నాటికి 2,792 కొవిడ్ పాజిటివ్ కేసులుండగా.. తాజాగా అవి 7072కు పెరిగాయని ఆందోళన వ్యక్తం చేశారు. కేవలం 20 రోజుల్లోనే కేసుల సంఖ్య రెట్టింపయ్యిందని ఆరోపించారు. ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని తక్షణమే హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో ఆరోగ్య అత్యవసర పరిస్థితిని ప్రకటించాలని.. కొవిడ్ నియంత్రణకు కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆయన విజ్ఞప్తి చేశారు.