మరో ఆరునెలల్లో డ్రగ్ లేదా వ్యాక్సిన్ రావొచ్చని.. అప్పటివరకు ప్రాణాలను కాపాడుకునే బాధ్యత మనదేనని మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత నాగం జనార్దన్ రెడ్డి సూచించారు. వైరస్ను నియంత్రించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. వైరస్ కట్టడి, సీజనల్ వ్యాధుల నివారణపై ప్రభుత్వానికి ఆయన పలు సూచనలు చేశారు.
''రాష్ట్రంలో కరోనా వైరస్ ప్రమాదకర స్థాయికి చేరుకుంది. వైరస్ను నియంత్రించడంలో ప్రభుత్వం విఫలమైంది. ఈ క్రమంలో ప్రజలు భయపడకుండా ప్రభుత్వం విరివిగా నిర్ధరణ పరీక్షలు చేయాలి. పేద, మధ్య తరగతి ప్రజలకు పౌష్టికాహారం అందేలా చూడాలి. ఇతర వ్యాధులు ఉన్నవారిపై ప్రత్యేక శ్రద్ధ చూపాలి. జిల్లాకు ఓ ప్రత్యేక ఆస్పత్రిని ఏర్పాటు చేయాలి. ఈ సీజన్లో డెంగీ కూడా విజృంభించే అవకాశముంది కాబట్టి దానిపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. దోమల ద్వారా వ్యాప్తి చెందుతుంది కాబట్టి వాటిని అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలి.''
-మాజీ మంత్రి, నాగం జనార్దన్ రెడ్డి
మన ప్రాణాల్ని కాపాడుకునే బాధ్యత మనదే కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలకు సూచించారు. మరో ఆరునెలల్లో డ్రగ్ లేదా వ్యాక్సిన్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి అప్పటి వరకు జాగ్రత్తగా ఉండాలన్నారు. గతంలో ఆరోగ్యశాఖ మంత్రిగా పని చేసిన అనుభవంతో విజ్ఞప్తి చేస్తున్నందున తన సలహాలు పరిగణనలోకి తీసుకోవాలని కోరారు.
ఇవీ చూడండి: 'నా గన్మెన్లకు కరోనా పరీక్షలు చేసి ఐదురోజులు అవుతోంది.. కానీ...'