Forest Trek Park in Hyderabad : తెలంగాణకు హరితహారం కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం పట్టణ ప్రాంతాల్లోని రిజర్వ్ ఫారెస్ట్ బ్లాకులను అర్బన్ ఫారెస్ట్ పార్కులుగా అభివృద్ధి చేస్తోంది. ఆయా ఫారెస్ట్ బ్లాకులను పరిరక్షిస్తూనే కొంత ప్రాంతాన్ని ప్రజల సౌకర్యార్థం అభివృద్ధి చేస్తున్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 109 అర్బన్ ఫారెస్ట్‌లకు ప్రణాళికలు రూపొందించగా.. 73 ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. తాజాగా రంగారెడ్డి జిల్లా చిల్కూరు రిజర్వ్ ఫారెస్ట్‌కు చెందిన మంచిరేవుల సమీపంలో ఉన్న ఫారెస్ట్ ట్రెక్ పార్క్ ప్రారంభమైంది. మొత్తం 256 ఎకరాల విస్తీర్ణంలో ఫారెస్ట్ ట్రెక్ పార్కును రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో అభివృద్ధి చేశారు.
Forest Trek Park in Telangana : ఈ ప్రాంత భౌగోళిక స్వరూపం ట్రెక్కింగ్‌కు అనుకూలంగా ఉండటంతో అర్బన్ ఫారెస్ట్ పార్కుగా అభివృద్ధి చేయాలని అధికారులు నిర్ణయించారు. అందుకు అనుగుణంగా పనులు చేపట్టారు. రూ.7 కోట్లకు పైగా ఖర్చుతో పార్కును అభివృద్ధి చేశారు. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద మొక్కల కోసం దాదాపు రూ.90 లక్షలు ఖర్చు చేసింది. సుమారు 50 వేల స్థానిక జాతుల మొక్కలు నాటారు. దాదాపు 25 వేల పొద జాతులను గట్లుగా నాటారు. సందర్శకుల కోసం తాగునీటి ప్లాంట్, నాలుగు ట్రెక్కింగ్ మార్గాలు, నాలుగు కిలోమీటర్ల వరకు నడక మార్గాలు, టాయిలెట్ బ్లాక్, భవనాలు, వాచ్ టవర్, ఎనిమిది ఆకారంలో వాకింగ్ ట్రాక్, ఓపెన్ జిమ్, యాంఫిథియేటర్, జలపాతం, రచ్చబండలు, స్థానిక దేవతల గుడులు, కూర్చోవడానికి బెంచీలు ఏర్పాటు చేశారు. బొటానికల్ గార్డెన్, కేబీఆర్ నేషనల్ పార్క్ తర్వాత ఇది అత్యంత ప్రసిద్ధి చెందిన అర్బన్ ఫారెస్ట్ పార్క్(Urban Forest Park)గా అవతరించిందని అధికారులు చెప్తున్నారు.
Indian Forest Survey Report 2023 : హరితహారం ద్వారా తొమ్మిదేళ్లలో 273 కోట్ల మొక్కల పెంపకం
ప్రత్యేక ఆకర్షణగా వాచ్ టవర్..: పార్కు మధ్యలో ఏర్పాటు చేసిన వాచ్ టవర్(Watch Tour) ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. అక్కడి నుంచి చూస్తే ఓఆర్ఆర్ పరిసరాల్లో ఉన్న, వస్తున్న ఆకాశ హర్మ్యాలు కనువిందు చేస్తున్నాయి. పార్కులో ఉన్న రాళ్లపై జంతువుల పెయింటింగ్‌తో పాటు ప్రత్యేకంగా బ్యాలెన్సింగ్ రాక్స్, బేబీ ఎలిఫెంట్, డేగ ముఖం, వృద్ధ సన్యాసి మొదలైన అందమైన రాతి నిర్మాణాలు యువత, పిల్లలను ఆకర్షిస్తున్నాయి. ఈ మార్గాలను కలుపుతూ ఉద్యానవనం, ట్రెక్ మార్గాల్లో అభివృద్ధి చేయబడిన వాకింగ్ ట్రాక్‌లకు చిన్న చిన్న కొండలు, తరంగాల స్వరూపంతో కూడిన భూభాగం మరింత ఆకర్షణను కలిగిస్తున్నది. పార్కులో అభివృద్ధి చేసిన చిన్న చెరువు, పెద్దమ్మ చెరువు, చెక్‌డ్యాం ఈ ప్రాంతాన్ని మరింత సుందరంగా మారుస్తున్నాయి. ట్రెక్కింగ్ అవకాశం ఉండటంతో పార్కు పెద్ద సంఖ్యలో సందర్శకులను ఆకర్షిస్తున్నది. ఉష్ణమండల డ్రై స్క్రబ్ ఫారెస్ట్‌ను సంరక్షించడంతో పాటు మరింతగా పునరుజ్జీవింపచేసేందుకు ఇక్కడ చర్యలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం ఉన్న చెట్లు, నీటి జలాశయాలు అటవీ పునరుజ్జీవనానికి తోడ్పడతాయని అధికారులు చెప్తున్నారు.
"హైదరాబాద్ చుట్టుపక్కల సుమారు 188 ఫారెస్ట్ బ్లాక్స్ ఉన్నాయి. అందులో 59లో అటవీ పార్కులు ఏర్పాటు చేశాం. ప్రజల ఆరోగ్యం కోసం వాకింగ్ ట్రాక్, ప్రశాంతమైన వాతావరణాన్ని కల్పించాం. పర్యాటకుల కోసం ట్రెక్కింగ్ కూడా ఏర్పాటు చేశాం."- డోబ్రియల్, అటవీ ప్రధాన సంరక్షణాధికారి
Harish Rao on Haritha Haram : 'దేశంలోనే 7.4 శాతం గ్రీన్ కవర్ పెంచిన ఏకైక రాష్ట్రం.. మన తెలంగాణ'