రాష్ట్రంలో పచ్చదనం పెంపు, అడవుల పునరుజ్జీవంపై అధ్యయనానికి రాష్ట్రంలో పార్లమెంటరీ స్థాయీ సంఘం పర్యటనకు నిర్ణయించిందని.. అటవీ సంరక్షణ ప్రధానాధికారి శోభ తెలిపారు. కేంద్ర మాజీ మంత్రి జైరాం రమేశ్ నేతృత్వంలో.. సుమారు 25 మంది ఎంపీలు, ఉన్నతాధికారుల బృందం.. ఏప్రిల్ నెలలో ఐదురోజుల పాటు రాష్ట్రంలో పర్యటిస్తుందని చెప్పారు. అన్ని జిల్లాల అటవీశాఖ అధికారులతో ఆమె దృశ్యమాధ్యమ సమీక్ష నిర్వహించారు.
స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లైన సందర్భంగా.. అటవీశాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించారు. జిల్లాకు ఒకటి చొప్పున సమస్యాత్మక గ్రామాలను గుర్తించి అడవుల ప్రాముఖ్యత, ఆక్రమణలు, జంతువుల వేట, అగ్ని ప్రమాదాల నివారణ, తదితర విషయాలపై ప్రజలను చైతన్యవంతం చేయాలని నిర్ణయించారు. అడవుల్లో వేసవి సమస్యలు, వివిధ పనుల పురోగతి, హరితహారం ఏర్పాట్లు తదితర అంశాలపై చర్చించారు. క్షేత్రస్థాయి అటవీ అధికారులకు సీసీఎంబీ ఆధ్వర్యంలో మార్చి 18,19 తేదీల్లో ప్రత్యేక శిక్షణ ఉంటుందని పీసీసీఎఫ్ శోభ వెల్లడించారు.