అటవీ నేరాల్ని అదుపుచేసేందుకు గూఢచారుల సేవలు తీసుకోవాలని అటవీశాఖ నిర్ణయించింది. విలువైన సమాచారం ఇచ్చే వేగులకు ఆర్థిక పారితోషికం ఇవ్వనుంది. దీనికోసం రహస్య సమాచార నిధి ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఎ.ఇంద్రకరణ్‌రెడ్డి వెల్లడించారు. ఈ నిధికి సీఎం కేసీఆర్ రూ.4.06 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. ములుగు జిల్లాలో పెద్దపులిని చంపడం బాధాకరమన్నారు. రెండు, మూడేళ్లలోనే మూడు పులులు హత్యకు గురయ్యాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చూడాలని అధికారుల్ని ఆదేశించారు. అటవీశాఖ కార్యకలాపాలపై మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో సోమవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు సుదీర్ఘ సమావేశం జరిగింది. వన్యప్రాణుల వేట, కలప స్మగ్లింగ్ అరికట్టడానికి, అడవుల రక్షణ కోసం, ఆక్రమణల నివారణకు సమాచారం ఇచ్చేవారి కోసం ఈ నిధిని వినియోగిస్తారు.
శాశ్వతంగా అటవీ ఆక్రమణల నివారణ...
అటవీ భూముల ఆక్రమణల్ని శాశ్వతంగా నివారించే దిశగా సీఎం కేసీఆర్ ఆలోచిస్తున్నారని సీఎం కార్యాలయ ప్రత్యేక అధికారి భూపాల్‌రెడ్డి తెలిపారు. అవసరమైతే మరింత మంది సిబ్బందిని సిద్ధం చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ప్రత్యేక ప్రధానకార్యదర్శి శాంతికుమారి అన్నారు. అటవీశాఖకు సీఎం కేసీఆరే బ్రాండ్ అంబాసిడర్ అని పీసీసీఎఫ్ ఆర్.శోభ వ్యాఖ్యానించారు. వర్క్‌షాప్‌లో సీఎం ఓఎస్డీ ప్రియాంక వర్గీస్, అన్ని అటవీసర్కిళ్లు, అధికారులు పాల్గొన్నారు.
పులుల సంరక్షణకు ప్రత్యేక టాస్క్‌ఫోర్స్...
సరిహద్దు సమస్యల కారణంగా పులుల సంరక్షణ, ట్రాకింగ్‌పై ప్రభావం పడుతోందని ఒకరిద్దరు అధికారులు సమావేశంలో అభిప్రాయపడ్డారు. ‘ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేయాలి. ఆ కమిటీకి జిల్లాల సరిహద్దులు లేకుండా, పులులు ఎక్కడికి వెళితే అక్కడికి ట్రాక్ చేస్తూ వెళ్లే వెసులుబాటు కల్పించాలి’అని నిర్మల్ డీఎఫ్‌ఓ సూచించారు.
ఇదీ చదవండి: CM KCR: తెలంగాణ పట్ల కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది: కేసీఆర్