అటవీ శాఖ అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బంది పూర్తి చిత్తశుద్ధితో పనిచేయాలని... అటవీ సంరక్షణ ప్రధానాధికారి శోభ తెలిపారు. అటవీ భూములు అన్యాక్రాంతం కాకుండా జాగ్రత్తగా కాపాడుకోవాలని అన్నారు. కొన్నిచోట్ల అటవీ నేరాల్లో అటవీ అధికారులు, సిబ్బంది ప్రమేయంపై ఆరోపణలు వస్తున్నాయని... వాటిపై విచారణ జరిపి నిజమని తేలితే కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
అటవీ భూముల రక్షణ, అన్యాక్రాంతమైన అటవీ భూముల స్వాధీనం విధానాలపై అన్ని జిల్లాల అధికారులతో జరిగిన ఆన్‌లైన్ సమావేశంలో పీసీసీఎఫ్ పాల్గొన్నారు. దూలపల్లిలోని తెలంగాణ అటవీ అకాడమీ నేతృత్వంలో జరిగిన సమావేశంలో అన్ని జిల్లాల క్షేత్రస్థాయి అధికారులు, సిబ్బందికి అటవీ భూముల రక్షణపై అవగాహన కలిగించే అంశాలపై చర్చించారు.
ఏటా వర్షాకాలం ముందు కొత్త వ్యవసాయ సీజన్ ప్రారంభంలో కొంత మేర అటవీ భూముల ఆక్రమణ ప్రయత్నాలు జరుగుతాయని... క్షేత్రస్థాయి పెట్రోలింగ్ ద్వారా వాటిని సమర్థంగా నివారించవచ్చని తెలిపారు. ఆక్రమణలకు గురైన అటవీ భూములు తిరిగి స్వాధీనంలో చట్ట ప్రకారం వ్యవహరించాలన్నారు. అడవుల ప్రాధాన్యత, ఆక్రమణల నష్టాలను వివరిస్తూ, సమీప గ్రామాలు, గూడేల ప్రజలను చైతన్యవంతం చేయాలని సూచించారు.
ఇదీ చదవండి:'ఆగస్టు నుంచి భారత్‌లోనే 'స్పుత్నిక్-వి' ఉత్పత్తి'