Forest Area In Telangana: దేశంలో గత రెండేళ్లుగా అటవీవిస్తీర్ణం, సంబంధించిన అంశాలపై కేంద్ర అటవీశాఖ రూపొందించిన 2021 ఫారెస్ట్ రిపోర్ట్‌ను కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్ విడుదల చేశారు. 2019తో పోలిస్తే దేశవ్యాప్తంగా 2,261 చదరపు కిలోమీటర్ల మేర అడవులు, వృక్షసంపద వృద్ధి చెందిందని... అందులో అటవీవిస్తీర్ణం పెరుగుదల 1,540 చదరపు కిలోమీటర్లుగా నివేదిక తెలిపింది. వృక్షసంపద సైతం 721 చదరపు కిలోమీటర్ల మేర పెరిగింది.
రెండులో తెలంగాణ...
దేశంలోని 17 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు వాటి విస్తీర్ణంలో 33 శాతానికి పైగా ఆటవీవిస్తీర్ణాన్ని కలిగి ఉన్నాయి. దేశవ్యాప్తంగా ఎక్కువ అటవీవిస్తీర్ణం మధ్యప్రదేశ్‌లో ఉంది. గడచిన రెండేళ్లలో అటవీవిస్తీర్ణం ఆంధ్రప్రదేశ్‌లో అధికంగా 647 చదరపు కిలోమీటర్లు పెరగగా... 632 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం పెరుగుదలతో తెలంగాణ రెండో స్థానంలో నిలిచింది. 2019 నివేదిక ప్రకారం రాష్ట్రంలో అటవీ విస్తీర్ణం 20,582 చదరపు కిలోమీటర్లు కాగా 2021 నివేదిక ప్రకారం ఆ మొత్తం 21,214 చదరపు కిలోమీటర్లకు పెరిగింది. 537 చదరపు కిలోమీటర్ల పెరుగుదలతో ఒడిశా మూడో స్థానంలో ఉంది.
నాలుగోస్థానంలో హైదరాబాద్...
నివేదిక ప్రకారం తెలంగాణ రాష్ట్ర విస్తీర్ణం 1,12,077 చదరపు కిలోమీటర్లు. అందులో నమోదైన అటవీ విస్తీర్ణం 27,688 చదరపు కిలోమీటర్లు. ఇది మొత్తం విస్తీర్ణంలో 24.70 శాతం. దేశంలోని మెగాసిటీల్లో చూస్తే గడచిన పదేళ్లుగా అటవీవిస్తీర్ణం పెరుగుదలలో హైదరాబాద్ అగ్రభాగాన నిలిచింది. దిల్లీ, ముంబయి, కోల్‌కతా, బెంగుళూరు, చెన్నై, అహ్మదాబాద్, హైదరాబాద్ నగరాల్లో 509 చదరపు కిలోమీటర్ల మేర అటవీప్రాంతం విస్తరించి ఉంది. వాటి మొత్తం భూభాగంలో ఇది 10.21 శాతం. 194.24 చదరపు కిలోమీటర్ల అటవీప్రాంతంతో దిల్లీ మొదటిస్థానంలో ఉంది. 81.81 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో హైదరాబాద్ నాలుగో స్థానంలో ఉంది. గడిచిన పదేళ్లలో ఈ ఏడు మహానగరాల్లో 68 చదరపు కిలోమీటర్లు మేర అడవుల అభివృద్ధి జరిగింది.
సత్ఫలితాలనిస్తోన్న హరితహారం...
వృద్ధిలో హైదరాబాద్ మొదటి స్థానంలో నిలిచింది. నగరంలో గత పదేళ్లుగా 48.66 చదరపు కిలోమీటర్ల మేర ఆటవీవిస్తీర్ణం పెరిగినట్లు కేంద్ర నివేదిక పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన హరితహారం పథకం సత్ఫలితాలను ఇస్తోందని చెప్పవచ్చు. ఆ కారణంగానే రాష్ట్రంలో ఆటవీవిస్తీర్ణం పెరిగింది. హైదరాబాద్, శివారులో అర్బన్ పార్కుల అభివృద్ధి, ఆటవీప్రాంతాల పరిరక్షణ, పచ్చదనం పెంపు చర్యలు ఫలితాలు ఇస్తున్నట్లు నివేదిక ద్వారా తెలుస్తోంది. మరోవైపు రాష్ట్రంలోని కవ్వాల్ పులుల సంరక్షణా ప్రాంతంలో అడవుల విస్తీర్ణం 118.97 చదరపు కిలోమీటర్ల మేర తగ్గినట్లు నివేదిక వెల్లడించింది.