అందమైన తంజావూరు చిత్రాలు, నయనమనోహరమైన ప్రకృతి చిత్తరువులు... ఒకదానితో మరొకటి పోటీపడుతూ ఆ ఆర్ట్ ఎగ్జిబిషన్‌కి ఎక్కడలేని అందాన్నీ తెచ్చిపెట్టాయి. ‘వీటిని గీసిన చిత్రకారుడెవరో కానీ...’ అని కుతూహలం పడుతున్న కళాభిమానులకు ఆ చిత్రాలని గీసింది ఓ మహిళ అని తెలిసింది. అందులో ఆశ్చర్యమేమీలేదు. కానీ ఆమెకు రెండు చేతులూ లేవు. ఆ చిత్రాలని ఆమె కాళ్లతో వేసింది అని తెలిశాక వాళ్ల ఆశ్చర్యానికి అంతులేదు. స్వప్న ఇప్పటివరకూ నాలుగువేల చిత్రాలని గీసింది. వాటిలో స్టీఫెన్‌హాకిన్స్, మోటివేషనల్ స్పీకర్ నిక్ వైజెచ్ చిత్రాలంటే తనకి చాలా ఇష్టం అని చెబుతుంది. అందుకు కారణం... వాళ్లంతా వైకల్యాన్ని జయించి తమ రంగాల్లో అద్భుతాలు చేసినవాళ్లే.
చెంచాతో మొదలుపెట్టి...
కేరళలోని ఎర్నాకుళం ప్రాంతంలో ఓ వ్యవసాయ కుటుంబంలో పుట్టింది స్వప్న. తండ్రి అగస్తిన్ రైతు. తల్లి సోఫీ గృహిణి. స్వప్న పుట్టినప్పుడు ‘అందంగా మల్లెపూవులా ఉంది నీ కూతురు...’ అంటూనే... అసంపూర్ణంగా ఆగిపోయింది నర్సు గొంతు. ఎందుకో బిడ్డను చూస్తేకానీ అర్థం కాలేదు సోఫీకి. అంత ముద్దుగా ఉన్న ఆ పాపకి రెండు చేతులూ లేవు. ఆ బిడ్డనెలా పెంచాలో ఆ దంపతులకు అర్థం కాలేద]ు. దీనికితోడు ‘ఇలాంటి పిల్లని ఎలా పెంచుతారు?’, ‘ఎవరికైనా ఇచ్చేయండి. బరువు దించుకోండి’ అంటూ బంధువులు తలోమాటా అన్నారు. స్వప్న తరువాత ముగ్గురు పిల్లలు పుట్టారా దంపతులకు. ‘చెల్లెళ్లు, తమ్ముడు చకచకా అన్నం తినేస్తుంటే... నేను మాత్రం ఎవరైనా తినిపించే వరకూ ఆగాల్సి వచ్చేది. అలాంటప్పుడు దుఃఖం ఆపుకోలేక ఏడ్చేదాన్ని.
అప్పుడు నా కాలితోనే చెంచా పట్టుకుని తినడం నేర్పించాడు నాన్న. ఇంట్లో కన్నా.. బయట నాలాంటి వాళ్ల కోసం ప్రత్యేకంగా ఉండే హోమ్‌లో చేర్పిస్తే మంచిదనుకున్నారు అమ్మానాన్న. నాకు అయిదేళ్లప్పుడు చెంగనశేరిలో ఉన్న ఓ మెర్సీహోమ్‌లో చేర్చారు. కుటుంబానికి దూరంగా ఉన్నానన్న ఒక్క బాధ తప్ప... అక్కడ చాలా సంతోషంగా ఉండేది. ఎందుకంటే అక్కడున్నవారంతా నాలాంటి వాళ్లే. నాకు కనీసం కాళ్లైనా ఉన్నాయి. అవి లేనివాళ్లు ఎందరో? వాళ్లతో పోలిస్తే నేను అదృష్టవంతురాలినే’ అంటుంది స్వప్న. చదువుతోపాటు ఆటలూ, నృత్యంలోనూ చురుగ్గా ఉండేది. అక్కడ ఉండే నన్స్ సాయంతో కాలుతోనే పెన్సిల్ పట్టుకుని అక్షరాభ్యాసం చేసింది. మొదట్లో పెన్సిల్‌తో మాత్రమే బొమ్మలు వేసిన ఆమె మూడో తరగతికి వచ్చేసరికి బ్రష్ పట్టుకుని వాటర్‌కలర్స్‌తో ప్రకృతి దృశ్యాలని యథాతథంగా ఆవిష్కరించడం మొదలుపెట్టింది. అప్పట్నుంచీ చదువుకుంటూనే బొమ్మలు వేయడాన్నీ కొనసాగించింది. పదోతరగతిలో మంచి మార్కులు సాధించి అళపుళాలోని సెయింట్‌జోసెఫ్ కాలేజీలో చేరింది. అక్కడే బీఏ వరకూ చదివింది. డిగ్రీ చదివేంతవరకూ హాస్టల్‌లోనే గడిపిన స్వప్న ఆ తర్వాతే ఇంటికెళ్లింది. స్వతంత్రంగా జీవించడం నేర్చుకుంది.
అతడి స్ఫూర్తితో...
నిక్‌వైజెచ్‌కి కాళ్లూ చేతులూ లేవు. కేవలం మొండెం మాత్రమే ఉంటుంది. కానీ మోటివేషనల్ స్పీకర్‌గా అతని మాటలు లక్షలాదిమందిలో స్ఫూర్తిని రగిలిస్తున్నాయి. స్వప్నకి నిక్ అంటే ఎనలేని అభిమానం. అతడి ప్రసంగాలని తప్పకుండా వినేది. నిక్ సైతం స్వప్నలోని ప్రతిభను గుర్తించి ప్రశంసించాడు. అతడి స్ఫూర్తితోనే... ప్రపంచ ‘మౌత్ అండ్ ఫుట్ పెయింటింగ్ ఆర్టిస్ట్స్’(ఏఎంఎఫ్‌పీఏ)’ సంఘంలో సభ్యురాలిగా చేరింది. ఈ సంఘంలో సభ్యత్వం అంత తేలిక కాదు. చాలా వడపోతల తరువాతే వస్తుంది. మన దేశం నుంచి కేవలం పాతికమంది చిత్రకారులు దీన్లో సభ్యులుగా ఉన్నారు. ఇలా సభ్యత్వం సాధించిన వారికి నెలకు రూ.20 వేల వరకు ఆర్థికసాయం అందుతుంది. దాంతోపాటూ తమ చిత్రాలని ప్రపంచవ్యాప్తంగా ప్రదర్శించుకునే అవకాశమూ ఉంటుంది. అలా స్వప్న వేసిన బొమ్మలకు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఏర్పడ్డారు. దుబాయ్, టర్కీ వంటి దేశాల్లో పర్యటించిన స్వప్న చిత్రాలకు రూ.50 వేల నుంచి లక్ష వరకు ధర పలుకుతోంది. అంతర్జాతీయస్థాయిలో ఆమె వేసిన బొమ్మలు గ్రీటింగ్‌కార్డులు, దుస్తులపై డిజైన్లలా మారుతున్నాయి. తన జీవితానుభవాలనే స్ఫూర్తిపాఠాలుగా చెబుతూ మోటివేషనల్ స్పీకర్‌గా రాణిస్తోంది. స్వప్న జీవితంపై కేరళ ప్రభుత్వం ‘ద గర్ల్ విత్ మేజిక్ ఫీట్’ అనే లఘుచిత్రాన్ని రూపొందించి చిన్నారులకు ఆమె గెలుపు కథని చెబుతోంది.
ఇదీ చూడండి: మిస్ టీన్ తెలుగు యూనివర్స్‌గా నిత్య కొడాలి