Food and Fun Festival at Marri Chenna Reddy HRD: శిక్షణలో ఉన్న కేంద్ర సివిల్ సర్వీసెస్ అధికారులు తమ పాకశాస్త్ర నైపుణ్యాన్ని ప్రదర్శించారు. తమ తమ ప్రాంతాల్లోని ప్రత్యేక వంటకాలను అందరికీ రుచి చూపడంతో పాటు ప్రత్యేక వస్త్రధారణతో ఆకట్టుకున్నారు. మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ది కేంద్రంలో భారత భోజనం పేరిట జరిగిన ఫుడ్ అండ్ ఫన్ ఫెస్టివల్ ద్వారా వచ్చిన డబ్బులను ఛారిటీ కార్యక్రమాలకు విరాళంగా ఇచ్చారు.
Food and Fun Festival Event: హైదరాబాద్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ది కేంద్రం దేశంలోని వివిధ ప్రాంతాల వస్త్రధారణ, అక్కడి ప్రత్యేక వంటకాలకు వేదికైంది. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి కేంద్ర సివిల్ సర్వీసులకు ఎంపికైన 112 మంది అధికారులు ఇక్కడ ఫౌండేషన్ కోర్సులో శిక్షణ పొందుతున్నారు. శిక్షణలో భాగంగా బడ్జెటింగ్, నాయకత్వ, ఎంట్రప్రిన్యూర్ షిప్ నైపుణ్యాలు, తదితరాల్లో అవగాహన కోసం ఫుడ్ అండ్ ఫన్ ఈవెంట్ నిర్వహించారు.
ప్రత్యేక వంటకాలు.. రుచికరంగా..: భారత భోజనం పేరిట జరిగిన ఈ కార్యక్రమంలో శిక్షణలో ఉన్న అధికారులు తమ ప్రాంతాలకు చెందిన ప్రత్యేక వంటకాలను స్వయంగా తయారు చేశారు. ఆయా రాష్ట్రాలకు చెందిన ప్రత్యేక వంటకాలను రుచికరంగా సిద్దం చేశారు. తమ విభిన్న వంటకాలతో భారతదేశంలో ఉన్న భిన్నత్వంలోని ఏకత్వాన్ని చాటారు. ఈశాన్య ప్రాంతాలకు చెందిన చంపారన్ మటన్ హండీ, లిట్టి చోకా, షిరికండ్.. పశ్చిమంలోని పురాన్ పోలి, పిత్ల భఖార్, వడపావ్.. ఉత్తరాదికి చెందిన మ్యాంగో లస్సీ, కటోరి చాట్, రబ్డి ఫలుదా.. దక్షిణాదిలోని నాటు కోడి, మటన్ కర్రీ, గులాబ్ జామ్ తదితర వంటకాలను భారత భోజనంలో తయారు చేసి విక్రయించారు.
ఆటపాటలతో సందడి చేసిన అధికారులు: అధికారులు, ఎంసీఆర్ హెచ్ఆర్డీ ఫ్యాకల్టీ, సిబ్బంది ఆయా స్టాళ్లను సందర్శించి వంటకాలను రుచి చూశారు. దేశవ్యాప్తంగా ఉన్న విభిన్న వంటకాలను తమకు రుచి చూసే అవకాశం ఓకే చోట లభించిందని శిక్షణలో ఉన్న అధికారులకు వారు కృతజ్ఞతలు తెలిపారు. వంటలు విక్రయించగా.. వచ్చిన మొత్తాన్ని ఛారిటీకి విరాళంగా అందించారు. ఫుడ్ అండ్ ఫన్ ఈవెంట్‌లో భాగంగా శిక్షణలో ఉన్న అధికారులు తమ తమ ప్రాంతాలకు చెందిన సంప్రదాయ వస్త్రాలు, ఆభరణాలను ప్రదర్శించారు. దీంతో మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రం మినీ ఇండియాను తలపించింది. దీంతో పాటు అధికారులు వివిధ ఆటపాటలతో సందడి చేశారు.
ఇవీ చదవండి: