దేవుడి విగ్రహం వద్ద ఉండాల్సిన విరులు.. రైతు బుట్టల్లోనే మగ్గిపోతున్నాయి. మహిళల సిగలో మెరవాల్సిన పూలు అమ్ముడుపోక రోడ్ల పాలై వాడిపోతున్నాయి. కొవిడ్, భారీ వర్షాలు, ముంచెత్తిన వరదల వల్ల కలిగిన నష్టాల నుంచి కోలుకుంటున్న రైతులకు పండుగవేళ కూడా నిరాశే ఎదురైంది. కనీసం బతుకమ్మ పండుగ సందర్భంగా ఆశించిన ధర దక్కుతుందనుకున్న రైతులకు... కనీస ధర లభించక పెట్టుబడి వచ్చే అవకాశం లేదని గుడిమల్కాపూర్ మార్కెట్లోని (gudimalkapur flower market) పూల రైతులు వాపోతున్నారు.
![గుడిమల్కాపూర్ పూలమార్కెట్](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/13267429_flower-2.jpg)
పండుగవేళ నిరాశే..
మిగతా పండుగలతో పోలిస్తే బతుకమ్మ పండుగ ప్రత్యేకతే వేరు. తీరొక్క పూలతో బతుకమ్మను అలంకరించే మహిళలు ఆ తర్వాత ఆడి పాడతారు. ఈ నేపథ్యంలో పండుగ సందర్భంగా పూలకు డిమాండ్ అధికంగా ఉంటుంది. పెద్ద ఎత్తున మార్కెట్‌లో పూలు కొనుగోళ్లు జరుగుతాయి. కానీ ఈసారి పరిస్థితులు ఇందుకు భిన్నంగా ఉన్నాయి. కొనుగోలుదారులు లేక... పూలకు కనీస ధర పలకడం లేదు. ఎన్నో వ్యయప్రయాసలకోర్చి తీసుకొచ్చిన పంటను ఎదురుగా పెట్టుకుని వేచి చూడాల్సి వస్తోంది. పండుగ సందడి మొదలైనా.. పూల అమ్మకాలు సాగక.. ఎంతో కొంతకు అమ్ముకుంటున్నారు. (flower market down in hyderabad). స్వయంగా అమ్ముకుని నాలుగు డబ్బులు తీసుకెళ్తామని మార్కెట్కు వచ్చిన రైతులకు నిరాశే మిగులుతోంది.
![కొనుగోళ్లు లేక వ్యాపారుల ఆవేదన](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/13267429_flower.jpg)
కూలీ ఖర్చులు రాని పరిస్థితి
కొవిడ్ కారణంగా లాక్డౌన్ సమయంలో పూల వ్యాపారులు ఆర్థికంగా చితికిపోయారు. ఆ తర్వాత పరిస్థితులు క్రమంగా ఆశాజనకంగా మారుతున్నాయి అనుకుంటున్న సమయంలో భారీ వర్షాలు, వరదలతో పూలసాగు చేస్తున్న రైతులు నిండా మునిగిపోయారు. వరద నీటితో బంతి, చేమంతి, గులాబీ, సన్నజాజి, మల్లెలు, ఆస్టర్‌సహా, జెర్బెరా, కార్నేనేషన్ వంటి అలంకరణ పూల పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. వర్షాలు, వరదల నుంచి కోలుకుని.. మిగిలిన పంటనైనా విక్రయించుకుందామంటే మార్కెట్‌లో ధరలు లేవు(flower prices drop in hyderabad). బంతిపూలు కిలో రూ.20 నుంచి 30, చామంతి 40 నుంచి 50, గులాబీ రూ.60 మించి లేదని రైతులు వాపోయారు.
![పండుగవేళ మార్కెట్ వెలవెల](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/13267429_flower-5.jpg)
ఇప్పటి వరకు పూల ధరలు అటు ఇటూ ఉన్నా.. కనీసం పండుగ సీజన్లో అయినా మంచి ధర వస్తుందని ఆశించాం. కానీ అలాంటి పరిస్థితి లేదు. గిరాకీ కూడా ఆశించినంత మేర లేదు. వర్షాల వల్ల పంట పాడైపోయింది. మిగిలిన పంటను అమ్ముకుందామంటే ఇక్కడ ధరలేదు. - రాజు, పూల సాగు రైతు
పూలసాగు తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. కనీసం కూలీ ఖర్చులు, రవణా ఖర్చులు రావడం లేదు. రేపు బతుకమ్మ పండుగ ఉంది కదా అని మార్కెట్కు పూలు తెచ్చాము. ఇక్కడ ఆశించినంతమేర గిరాకీ లేదు. -పూల రైతు
గిరాకీ లేక డీలా పడిన రైతులు
ఇదీ చూడండి: KCR announcement on jobs: '2, 3 నెలల్లో ఉద్యోగ నియామక ప్రక్రియ ప్రారంభం'