రాష్ట్ర రాజధాని నగర జీవనాన్ని భారీ వర్షాలు దారుణంగా దెబ్బతీశాయి. ముఖ్యంగా సామాన్యులు, పేదల బతుకులు ఛిద్రమయ్యాయి. కరోనా కట్టడి సమయంలో కేవలం ఉపాధి మాత్రమే కరవైందని, ఇప్పుడు సర్వం కోల్పోయామని ఎంతోమంది గగ్గోలు పెడుతున్నారు. వలస కార్మికులు, దినసరి కూలీలు, చిరుద్యోగులు, వీధి వ్యాపారుల పరిస్థితి దుర్భరంగా మారింది.. ఒక్కమాటలో చెప్పాలంటే కొన్ని వేలమంది జీవితాలు రోడ్డునపడ్డాయి. చాలా కుటుంబాలకు పూట గడవట్లేదు. అధికారులు, స్వచ్ఛంద సంస్థలు, దాతలు అందించే కొద్దిపాటి ఆహారాన్ని తిని బతుకులీడుస్తున్నారు.
ఇళ్లను ముంచెత్తిన నీరు
చెరువే కదా అని చెత్తాచెదారంతో నింపేసిన ఫలితమేమో.. అదే చెత్తను ఎత్తుకొచ్చి ఇళ్లలోకి విసిరేసింది వరద.ఏళ్ల తరబడి నగరం నిర్లక్ష్యం చేసినందుకేమో చెరువులు తమ ఉనికి కాపాడుకోడానికన్నట్లు ‘నీళ్లు’రిమి చూస్తున్నాయి.. అటు శంషాబాద్ నుంచి ఇటు మల్లాపూర్ వరకు.. ఇటు బాలాపూర్ నుంచి అటు కాటేదాన్ వరకు.. ఎటు చూసినా దయనీయ గాథలు.. దుర్భర బతుకులే! వరద ముంపు ప్రాంతాల్లో సోమవారం ‘ఈనాడు’ ప్రతినిధులు పర్యటించినప్పుడు ఎంతోమంది బాధితులు కన్నీటిపర్యంతమయ్యారు. ఒక్కరాత్రిలో ఇళ్లను ముంచెత్తిన నీరు ఇంకా వారి కళ్లలో సుడులు తిరుగుతోంది.
13న హడలెత్తించిన వరదలు
ఈ నెల 13న హడలెత్తించిన వరదలకు తోడు శనివారం రాత్రి, సోమవారం పడిన వర్షాలు చాలామందిని తేరుకోనివ్వలేదు. శంషాబాద్, బాలాపూర్, కాటేదాన్, అలీకాలనీ, వనస్థలిపురం, నాచారం.. ఇలా అనేక ప్రాంతాల్లో చిన్నపాటి ఆవాసాల్లో ఉంటూ చుట్టుపక్కల హోటళ్లు, పరిశ్రమల్లో ఉపాధి పొందుతున్న వేలాది కుటుంబాలు నట్టేట మునిగాయి. రాజేంద్రనగర్‌లోని అప్పా చెరువు వరదకు గుడిసెలు కొట్టుకుపోవడం, పరిశ్రమలూ వరదలో చిక్కుకోవడంతో కార్మికులు కట్టుబట్టలతో మిగిలారు. వంతెనలు, పార్కులు, బస్ షెల్టర్లలో తలదాచుకుంటున్నారు. గగన్‌పహాడ్, అల్వాల్, ఉమామహేశ్వర్‌కాలనీ, ఉప్పల్, నాచారం ప్రాంతాల్లోని కూలీల చేతిలో చిల్లిగవ్వ లేదు. సరూర్‌నగర్ చెరువు సృష్టించిన విధ్వంసంతో కోదండరామ కాలనీ, చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు గడపదాటలేకపోతున్నారు. వీధుల్లో సోమవారం కూడా మోకాలి లోతున వరద ప్రవహిస్తోంది. అనేక కాలనీల్లో కరెంటు లేదు.
చెరువు కట్ట తెగి..
బండ్లగూడ చెరువు సమీపంలో అయ్యప్పకాలనీ, మల్లికార్జుననగర్ ఫేజ్-1, ఫేజ్-2లో దాదాపు 210 కుటుంబాలు నివాసముంటున్నాయి. వారం క్రితం చెరువుకట్ట తెగి కాలనీల్లోని ఇళ్లన్నీ పైకప్పు వరకు మునిగాయి. ఇళ్లలోని ఒక్క వస్తువూ పనికివచ్చే పరిస్థితి లేదు. చెరువు కట్ట మరోవైపు ఎక్కడ తెగుతుందోనని మరో 13 కాలనీల ప్రజలు భయంతో ఉన్నారు.
బంధువుల ఇళ్లే దిక్కు
ముంపు కాలనీల ప్రజలను పునరావాస కేంద్రాలైన ఫంక్షన్ హాళ్లు, సామాజిక భవనాలకు పంపిస్తున్నారు. వాటిలో దుమ్ము, చెత్తాచెదారం పేరుకోవడం, కరెంటు ఉండక, దోమల బెడదతో ఇబ్బందులు పడుతున్నారు. చాలామంది బంధువుల ఇళ్లలో తలదాచుకుంటున్నారు.
20 అడుగుల లోతు నీరు
ఆదివారం రాత్రి 10 వరకు నాలాలు, కాలనీల్లో ప్రవాహం మామూలుగానే ఉండటంతో ఊపిరిపీల్చుకున్నామని.. అర్ధరాత్రి దాటాక 15-20 అడుగుల మేర వరద ప్రవహించిందని పాతబస్తీ హాఫీజ్‌బాబానగర్ వాసి సయ్యద్ గౌస్ తెలిపారు. ఒక ఇంట్లో కట్టేసిన 20కు పైగా గొర్రెలు 10 అడుగుల ఎత్తు గోడను దాటుకుని కొట్టుకువచ్చి మృత్యువాత పడటం తీవ్రతకు అద్దంపడుతోంది. ఇక్కడ 5 ఇళ్లు కూలిపోయాయి.
పది రోజులుగా నీటిలోనే
- ఈ నెల 13న కురిసిన భారీ వర్షంతో హైదరాబాద్ వ్యాప్తంగా 60 వేల కుటుంబాలు ముంపు కోరల్లో చిక్కుకున్నాయని అంచనా.
- ఉప్పల్ సమీపంలోని బండ్లగూడ చెరువుకు వరద పోటెత్తి మల్లికార్జునగర్, తదితర ప్రాంతాల్లో కింది అంతస్తులు పూర్తిగా మునిగిపోయాయి.
- బాలాపూర్ చెరువు కట్ట తెగి పాతబస్తీలోని ఛత్రినాక, ఉప్పుగూడ, లాల్‌దర్వాజ, కంచన్‌బాగ్, ఫలక్‌నుమా, చాంద్రాయణగుట్ట ప్రాంతాల్లో నిలువెత్తు నీరు నిలిచింది. జనం తాగునీరు, ఆహారానికి అవస్థలు పడుతున్నారు.
- జీడిమెట్ల ఫాక్స్‌సాగర్, టోలీచౌకీ శాతంచెరువు, పల్లెచెరువు దిగువ ప్రాంతాలైన నదీంకాలనీ, సుభాష్‌నగర్, ఉమామహేశ్వర కాలనీ, రాజేంద్రనగర్, చాంద్రాయణగుట్ట, ఫలక్‌నుమా, అలీ కాలనీలలో వరద నీరు నిలిచింది. నాచారం-ఉప్పల్ నల్ల చెరువు పరీవాహక ప్రాంతాల ప్రజలకు కునుకు కరవైంది.
- శంషాబాద్ జాతీయ రహదారిపై గగన్‌పహాడ్ వద్ద ఇప్పటికీ మరమ్మతులు పూర్తికాలేదు.
ఇవీచూడండి: వరద బాధితులకు ప్రభుత్వం అండ.. రూ.550 కోట్లు విడుదల