హైదరాబాద్ జీడిమెట్ల ఫాక్స్ సాగర్ చెరువు నిండుతుండటంతో స్థానికులు మరోసారి భయాందోళనకు గురవుతున్నారు. గతేడాది అక్టోబరులో కురిసిన భారీ వర్షాలకు సుభాష్ నగర్, గంపల బస్తీలోని ఇళ్లలోకి నీరు చేరింది. ఆ ప్రాంతాల్లో రాకపోకలకు ఇబ్బందులు ఎదురయ్యాయి. ఎగువన ఉన్న కొంపల్లి మున్సిపల్ పరిధిలోని ఉమామహేశ్వర కాలనీ మూడు నెలలు జలదిగ్బంధంలో ఉంది. అక్కడ నివసిస్తున్న సుమారు 600 కుటుంబాలు ఇళ్లు వదిలి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆ విపత్తు నుంచి కోలుకోకముందే గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలు నగరవాసుల్లో ఆందోళన కలిగిస్తున్నాయి.
తూములు మూసుకుపోయాయి
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఎగువ నుంచి వరదతో పాటు డ్రైనేజీ నీరు చెరువులోకి చేరుతుండటంతో ఫాక్స్ సాగర్ నిండుకుండలా కనిపిస్తోంది. దీంతో అధికారులు చెరువు తూము ద్వారా నీటిని దిగువకు వదులుతున్నప్పటికీ సజావుగా వెళ్లేందుకు దారిలేక దిగువన ఉన్న ప్రాంతాల్లోని ఖాళీ ప్రదేశాల్లోకి క్రమంగా నీరు చేరుతోంది. గతేడాది ప్రభావంతో ఎగువ నుంచి చెరువులో కలుస్తున్న డ్రైనేజీని దారి మళ్లించి పైపుల ద్వారా దిగువన ఉన్న నాలాలోకి కలిపేందుకు చర్యలు చేపట్టగా.. ఆ పనులు ఇంతవరకూ పూర్తికాలేదు. దాంతో నీరంతా చెరువు కింద ప్రైవేటు స్థలాల్లోకి వెళుతోంది. మరో రెండు వర్షాలు పడితే తమ పరిస్థితి ఆందోళనకరంగా మారే అవకాశం ఉందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పదిరోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. చెరువు పూర్తిగా నిండిపోయింది. ఇంతవరకూ ఏ ఒక్క ప్రజాప్రతినిధి చూడటానికి రాలేదు. ఇలాగే వర్షాలు పడితే సుభాష్ నగర్ మునిగిపోయే ప్రమాదం ఉంది. నాలాను కబ్జా చేయడంతో నీళ్లు వెళ్లే దారి లేకుండా పోయింది. -బొబ్బ ప్రసాద్, సుభాష్ నగర్
సాధారణ రోజుల్లో ఫాక్స్ సాగర్ చెరువు పర్యాటక ప్రదేశంలా ఉంటుంది. భారీ వర్షాలు పడితే ఉగ్రరూపం దాల్చుతుంది. నీళ్లు వెళ్లేందుకు నాలా మార్గం లేదు. వరద ఉద్ధృతికి దాదాపు 10 నుంచి 15వేల కుటుంబాలు మునిగిపోయే ప్రమాదం ఉంది. మమ్మల్ని పట్టించుకునే వారే లేరు. -నరేష్, జీడిమెట్ల
గండి పడితే.. ఇక అంతే
చెరువు ప్రభావం కూకట్పల్లి, కంటోన్మెంట్, కుత్బుల్లాపూర్, సనత్ నగర్ నియోజకవర్గాలకు ఉంటుందని.. ఆ ప్రాంతాలకు చెందిన నలుగురు ఎమ్మెల్యేలు కూర్చొని శాశ్వత పరిష్కారం చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. కట్టపై ఉన్న మట్టి క్రమంగా కోతకు గురవుతుండటంతో చెరువుకు గండి పడితే సుమారు 10 నుంచి 15 వేల కుటుంబాలు ముంపునకు గురవుతాయని తెలిపారు. ముందస్తు చర్యలు లేకపోవడంతో అధికారుల తీరుపై స్థానికులు మండిపడుతున్నారు. చెరువు నీరు వెళ్లేందుకు ఉన్న నాళాలపై కబ్జాలను తొలగించి శాశ్వత పరిష్కారం చూపాలని కోరుతున్నారు. ప్రస్తుతం చెరువు నిండడంతో సందర్శకుల తాకిడి పెరిగింది. దీంతో పోలీసులు చెరువు వద్ద బందోబస్తును ఏర్పాటు చేశారు.
ఇదీ చదవండి: భద్రాచలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ