బాధితుడి ఫిర్యాదు పట్ల నిర్లక్ష్యపూరితంగా వ్యవహరించిన పోలీసు అధికారులపై పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ బదిలీ వేటు వేశారు. మాసాబ్‌ట్యాంక్ ప్రాంతంలోని బంజారా ఫంక్షన్‌హాల్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఆ కేసులో బాధితుడు పంజాగుట్ట, బంజారాహిల్స్, హుమాయున్‌నగర్ పోలీస్‌స్టేషన్‌లలో ఫిర్యాదు ఇచ్చేందుకు గంటల తరబడి తిరిగాడు. తమ పరిధి కాదంటే తమది కాదంటూ వారంతా బాధితుడికి కనీసం ఘటనా స్థలం ఏ ఠాణా పరిధిలోకి వస్తుందో కూడా చెప్పకుండా నిర్లక్ష్య వైఖరి అవలంబించారు.
చివరకు బాధితుడు మరుసటి రోజు ఉదయం సైఫాబాద్ పోలీస్‌స్టేషన్‌లో ప్రమాదం గురించి ఫిర్యాదు చేశాడు. ఈ విషయాన్ని పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ తీవ్రంగా పరిగణించారు. బంజారాహిల్స్ ఠాణా ఎస్.ఐ.బీ.శ్రీనివాస్, హుమాయున్‌నగర్ ఎస్.ఐ. సత్యనారాయణ, బంజారాహిల్స్ కానిస్టేబుల్ రంజిత్ కుమార్, పంజాగుట్ట కానిస్టేబుల్ ఎలిషా కిరణ్, హోంగార్డు అంజయ్యలపై చర్యలు తీసుకున్నారు. వారందరినీ హెడ్ క్వార్టర్స్‌కు బదిలీ చేశారు.
బాధితుల పట్ల పోలీసు సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవరిస్తే ఉపేక్షించేది లేదని అంజనీకుమార్ స్పష్టం చేశారు. భవిష్యత్తులో ఇటువంటి చర్యలు పునరావృతం కాకుండా సిబ్బంది జాగ్రత్తగా ఉండాలని ఆయన సూచించారు.
ఇదీ చూడండి : నోటీసు లిస్తారా.. తొలగిస్తారా..? తేల్చుకోండి..!