fire accident at Hyderabad Vijayawada highway : సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం గుంపుల గ్రామ శివారులో ప్రమాదం చోటుచేసుకుంది. హైదరాబాద్ - విజయవాడ జాతీయ రహదారిపై ఏపీఎస్ ఆర్టీసీకి చెందిన రెండు బస్సుల్లో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో రెండు బస్సులు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఆదివారం తెల్లవారు జామున హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తున్న ఏపీ 29 జెడ్ 2930 నంబరు గల విజయవాడ డిపోకు చెందిన వెన్నెల బస్సులో టెక్నికల్ ప్రాబ్లం తలెత్తింది.
బ్యాటరీలో తలెత్తిన సమస్యతో బస్సు లైట్లు ఆఫ్ అయ్యాయి. దీంతో ప్రయాణికులను వేరే బస్సుల్లో పంపించారు. అనంతరం సూర్యాపేట నుంచి ఏపీఎస్‌ఆర్టీసీకే చెందిన మరో బస్సును రప్పించారు. వైర్ల సాయంతో రెండు బస్సుల మధ్య బ్యాటరీ ప్రాబ్లంను పరిష్కరించే ప్రయత్నం చేశారు. ఈలోపు సూర్యాపేట నుంచి వచ్చిన ఆర్టీసీ బస్సులో శబ్ధం వచ్చింది. వెంటనే ఆ బస్సులో మంటలు చెలరేగాయి.
ఆ మంటలే మొదటి బస్సుకు అంటుకున్నాయి. దీంతో ప్రయాణికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది... ఘటనా స్థలికి చేరుకున్నారు. రెండు బస్సుల్లో చెలరేగిన మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ప్రయాణికులు లేకపోవడంతో ప్రాణనష్టం తప్పదని సిబ్బంది తెలిపారు. ప్రయాణికులు అంతా ఊపిరిపీల్చుకున్నారు. ఈ సంఘటనతో హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ స్తంభించిపోయింది.
ఇక భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందులో కూడా అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఇల్లెందు మండలం బాలాజీ నగర్ పంచాయతీ వార్డు సభ్యుడు కోటికి చెందిన కారు మంటల్లో దగ్ధమైంది. ఇంటి ముందు నిలిపి ఉంచిన కారు మంటల్లో పూర్తిగా కాలిపోగా... వెనుక ఉన్న మరో కారు కూడా స్వల్పంగా దెబ్బతింది. ఉద్దేశపూర్వకంగానే నలుగురు వ్యక్తులు తన కారును దగ్ధం చేశారని కోటి పోలీసులకు ఫిర్యాదుచేశాడు. ఎస్సై రాజేష్ ఘటనా స్థలాన్ని పరిశీలించి ఆధారాలు సేకరించారు. ఇటీవల పంచాయతీ పాలకవర్గంలో విభేదాలతో నాయకుల మధ్య పరస్పర ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. ఈ గొడవలే ఘటనకు దారితీశాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఇవీ చదవండి: