Financial Assistance to TS BC and MBC Caste workers : రాష్ట్రంలో కులవృత్తులతో జీవనోపాధి పొందుతున్న ఎంబీసీ, బీసీల నుంచి దాదాపు లక్షన్నర మందికి ఆర్థిక సాయంపై ప్రభుత్వం విధివిధానాలు ప్రకటించనుంది. ప్రతి నియోజకవర్గంలో 1200 నుంచి 1500 మందికి లబ్ధి చేకూర్చేలా కసరత్తు చేస్తోంది. ఎలాంటి పూచీకత్తు లేకుండా పూర్తి సబ్సిడీతో లక్ష చొప్పున ఆర్థిక సాయం అందించనుంది. ఆ కార్యక్రమాన్ని నిరంతరం కొనసాగించాలని నిర్ణయించిన ప్రభుత్వం.. దశాబ్ది ఉత్సవాల సందర్భంగా తొలి విడత పథకాన్ని ప్రకటించనుంది.
దరఖాస్తుల స్వీకరణ, లబ్ధిదారుల ఎంపిక, ఆర్థిక సాయం తదితర విధివిధానాలను మంత్రివర్గ ఉపసంఘం ఖరారు చేయనుంది. ఈ మేరకు ఇవాళ సాయంత్రం 4 గంటలకు సమావేశమై, సీఎం కేసీఆర్ సమక్షంలో తుదివిధానాలు ప్రకటించనుంది. నాయీ బ్రాహ్మణులు, విశ్వబ్రాహ్మణులు, కుమ్మరి, మేదరి, రజక, పూసల వర్గాలతో పాటు.. మరిన్ని కులాలను గుర్తించిన ఉపసంఘం.. ఆయా వివరాలను వెల్లడించనుంది. అర్హులైన.. కులవృత్తులు చేసుకుంటున్న కుటుంబాల నుంచి ఆన్లైన్లో దరఖాస్తు తీసుకొని తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా పంపిణీ చేయనుంది. జూన్ 9న ఆర్థిక సాయం పంపిణీ కార్యక్రమాన్ని నియోజకవర్గాల వారీగా చేపట్టే అవకాశాలున్నాయి.
"రాష్ట్రంలో కులవృత్తులతో జీవనోపాధి పొందుతున్న ఎంబీసీ, బీసీలకు ఆర్థిక స్వావలంభన కోసం తెలంగాణ ప్రభుత్వం ఆర్థికసాయం అందించనుంది. ఎలాంటి పూచీకత్తు లేకుండా పూర్తి సబ్సిడీతో లక్ష చొప్పున ఆర్థికసాయం అందించనుంది. జూన్ 9న ఆర్థిక సహాయం పంపిణీ కార్యక్రమాన్ని నియోజకవర్గాల వారీగా ప్రారంభిస్తాము". - హరీశ్‌రావు, ఆర్ధిక, వైద్యారోగ్య శాఖ మంత్రి
Financial Assistance to Caste workers in Telangana : రాష్ట్రంలో ప్రస్తుతం ఎంబీసీ, బీసీ కార్పొరేషన్లకు స్వయం ఉపాధి రుణాల కోసం ప్రభుత్వం 603 కోట్లు కేటాయించింది. తాజాగా ప్రకటించిన ఆర్థిక సాయానికి ఆ నిధులు వినియోగిస్తారో లేక ప్రత్యామ్నాయంగా సర్దుబాటు చేస్తారో తెలియాల్సి ఉంది. చేతివృత్తులు చేసుకునే వర్గాలు ఎక్కువగా.. ఎంబీసీ కేటగిరీలో ఉన్నాయి. ఈ ఏడాదికి అందుబాటులో ఉన్న నిధులతో 39 వేల మంది ఎంబీసీలకు లబ్ధి చేకూర్చాలని బీసీ సంక్షేమశాఖ ఇప్పటికే కార్యాచరణ రూపొందించింది.
కానీ ఎంబీసీల్లో కులవృత్తులపై ఆధారపడ్డ కుటుంబాలు దాదాపు 12 లక్షల వరకు ఉన్నట్లు సర్కారు అంచనా. వారిలో కనీసం లక్ష నుంచి లక్షన్నర మందికి ఆర్థిక సాయం చేయడం ద్వారా ఆయా కులవృత్తులను ప్రోత్సహించడంతోపాటు.. వారు మరింత ఆదాయం సమకూర్చుకునేలా తోడ్పడాలని ప్రభుత్వం భావిస్తోంది. బీసీ కార్పొరేషన్ పరిధిలోని 303 కోట్లతో కనీసం 35 వేల మందికి రాయితీ రుణాలు అందించాలని కార్యాచరణ రూపొందించిన బీసీ సంక్షేమశాఖ.. ఆ మేరకు దస్త్రాన్ని సీఎం కేసీఆర్‌కు పంపించింది.
ఇవీ చదవండి: